Telugu Global
Telangana

బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్

ఇకపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటనలు ఈ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే వెలువడనున్నాయి.

BRS Twitter: బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్
X

బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్

తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నిన్నటి వరకు ఓ ప్రాంతీయ పార్టీగానే రాజకీయాలు చేసింది. జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రాతినిథ్యం ఉండాలని, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరును దసరా రోజు (అక్టోబర్ 5) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం కూడా పచ్చజెండా ఊపడంతో డిసెంబర్ 9న బీఆర్ఎస్ అధికార వేడుకలు జరిగాయి. తాజాగా బుధవారం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం ప్రజలకు, కార్యకర్తలకు తెలయజేయడానికి @trspartyonline (టీఆర్ఎస్ పార్టీ) పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్‌ను ఉపయోగించారు. తాజాగా దాన్ని @BRSparty (బీఆర్ఎస్ పార్టీ)గా మార్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. 'తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ "భారత రాష్ట్ర సమితి" (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారిన సందర్భంగా @trspartyonline గా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ పేరును @BRSpartyగా మార్చడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించగలరు.' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇకపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటనలు ఈ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే వెలువడనున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని ఫాలో అవుతున్న వాళ్లు ప్రత్యేకంగా బీఆర్ఎస్‌ను ఫాలో కావల్సిన అవసరం ఉండదు. టీఆర్ఎస్ పేరుతో గతంలో చేసిన ట్వీట్లు కూడా అలాగే కొనసాగనున్నాయి. పార్టీ శ్రేణులు ఎలాంటి అయోమయానికి గురి కావొద్దని, పాత అకౌంట్ స్థానంలో పేరు, ఐడీ మార్పు మాత్రమే జరిగిందని ప్రతినిధులు వివరించారు.



First Published:  14 Dec 2022 9:54 PM IST
Next Story