Telugu Global
Telangana

ఫ్రీ సింబల్స్‌పై హైకోర్టుకు టీఆర్ఎస్

గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఉపఎన్నిక సమయంలో కారు గుర్తును పోలిన అనేక గుర్తుల వల్ల పార్టీకి పడాల్సిన ఓట్లు చీలి పోయాయి.

ఫ్రీ సింబల్స్‌పై హైకోర్టుకు టీఆర్ఎస్
X

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల పరిశీలన ముగిసే సరికి బరిలో 83 మంది మిగలగా.. అందులో 10 మంది ఆదివారం ఉపసంహరించుకున్నారు. భారీగా నామినేషన్లు వేయడంతో చివరి వరకు మిగిలిన వారికి ఈసీ తప్పకుండా గుర్తులు కేటాయించాల్సి ఉన్నది. ప్రధాన పార్టీలు, రిజస్టర్డ్-అన్‌రికగ్నైగ్డ్ పార్టీలు తమ గుర్తులను ఉపయోగించుకుంటాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులు, అన్‌రిజిస్టర్డ్ పార్టీలు తప్పకుండా ఫ్రీ సింబల్స్ నుంచి ఏదో ఒక గుర్తును ఎంపిక చేసుకోవాల్సి ఉన్నది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవ్వాళ (సోమవారం) సాయంత్రం వరకు గడువు ఉండటంతో ఎంత మంది బరిలో మిగులుతారో తేలిపోతుది. అయితే ఫ్రీ సింబల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉండటంతో.. అధికార టీఆర్ఎస్ ఆందోళనకు గురవుతున్నది.

గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఉపఎన్నిక సమయంలో కారు గుర్తును పోలిన అనేక గుర్తుల వల్ల పార్టీకి పడాల్సిన ఓట్లు చీలి పోయాయి. దీంతో ప్రతీసారి ఆయా గుర్తులను తొలగించాలని ఎలక్షన్ కమిషన్‌ను పార్టీ కోరుతూ వస్తోంది. ముఖ్యంగా కారు గుర్తును పోలిన కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్డు రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు మిషన్, ఓడ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ కోరుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఈ నెల 9న లేఖ కూడా రాసింది. కానీ, ఈసీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ గుర్తులు ఎవరికైనా కేటాయిస్తే అది టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రభావం చూపుతుందని పార్టీ వాదిస్తోంది. కానీ ఈసీ మాత్రం దీనిపై ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.

టీఆర్ఎస్ పార్టీ తరపున శనివారమే హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కాగా, హైకోర్టు సూచన మేరకు సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరి భరత్ కుమార్ తెలిపారు. గత శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కారు గుర్తును పోలిన వాటి వల్ల పార్టీ ఎలా నష్టపోయిందో పిటిషన్‌లో వివరించనున్నట్లు ఆయన తెలిపారు. కారు గుర్తును పోలిన గుర్తులు కేటాయించబడిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు భారీగా ఓట్లు పోలైన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తమకు మరోసారి ఆయా గుర్తుల వల్ల నష్టం రాకూడదనే ఈ పిటిషన్ వేస్తున్నామని, తప్పకుండా హైకోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

First Published:  17 Oct 2022 6:43 AM IST
Next Story