అక్కడ హిజాబ్స్.. ఇక్కడ జాబ్స్.. పంచ్ అదిరింది..
ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరుని వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ బెంగళూరులోని అధికార బీజేపీపై అదిరిపోయే పంచ్ వేసింది.
ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరుని వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ బెంగళూరులోని అధికార బీజేపీపై అదిరిపోయే పంచ్ వేసింది. ఇప్పటికైనా ప్రజలకు ఏం కావాలనేదానిపై దృష్టి సారించాలని హితవు పలికింది. హిజాబ్ లపై దృష్టి పెడితే ఇలాగా ఉంటుందని, జాబ్ లపై దృష్టి పెట్టాలని సూచించింది. జాబ్ లపై కాకుండా పాలకుల దృష్టి హిజాబ్ లపై ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని కౌంటర్ ఇచ్చింది.
ఒకే దెబ్బకి రెండు పిట్టలు..
దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలవడమే కాదు, బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో ఇక్కడ టీఆర్ఎస్ కి డబుల్ బొనాంజా లభించినట్టయింది. తెలంగాణలో బీజేపీ సత్తా చూపిస్తాం, ఇక్కడ టీఆర్ఎస్ ని ఓడించి మమ్మల్ని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తామంటూ తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవల కాలంలో సవాళ్లు విసురుతున్నారు. ఇప్పుడు కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది, కానీ ఏమైంది.. ఎప్పటినుంచో కర్నాటకలోని బెంగళూరుకి ఉన్న సిలికాన్ సిటీ అనే క్రెడిట్ పోయింది. టీఆర్ఎస్ పాలనలో ఉన్న హైదరాబాద్ కి అది దక్కింది. అంటే అభివృద్ధి సాధ్యమైంది బీజేపీతోనా లేక టీఆర్ఎస్ తోనా అనే చర్చ మొదలైంది.
ఐటీ కంపెనీలకు కావాల్సిందేంటి..?
ఏ కార్పొరేట్ కంపెనీ అయినా.. మౌలిక వసతులతోపాటు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. ఘర్షణలు లేని వాతావరణం, ఇబ్బంది పెట్టని ప్రభుత్వం, సానుకూలంగా స్పందించే యంత్రాంగం.. ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టే కంపెనీలు హైదరాబాద్ కి క్యూ కడుతున్నాయి. బెంగళూరు పరిస్థితి రోజు రోజుకీ తీసికట్టుగా మారుతోంది. కర్నాటకలో ప్రభుత్వం స్థిరంగా ఉండదు, ఒకవేళ ఉన్నా.. కాషాయ నీడలో ఎప్పుడూ హిజాబ్ లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకే కర్నాటకలో హిజాబ్స్.. హైదరాబాద్ లో జాబ్స్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.