Telugu Global
Telangana

స్పీడ్ పెంచిన టీఆర్ఎస్.. దీపావళి తర్వాత మరింత జోరుగా..

మంత్రి కేటీఆర్ దీపావళి తర్వాత మునుగోడులో ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గట్టుప్పల మండలానికి కేటీఆర్‌ను బాధ్యుడిగా పార్టీ నియమించింది.

స్పీడ్ పెంచిన టీఆర్ఎస్.. దీపావళి తర్వాత మరింత జోరుగా..
X

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమకు కేటాయించిన గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావు కూడా ప్రచారంలోకి దిగారు. తనకు అప్పగించిన మర్రిగూడ మండలంలో ఆయన పర్యటించారు. ఇన్నాళ్లూ హరీశ్ రావు, కేటీఆర్ ప్రచారానికి రావడం లేదని టీఆర్ఎస్ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొన్నది. అయితే హరీశ్ మంగళవారం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించి టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

హరీశ్ రోడ్‌షోలో బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రాజగోపాల్ రెడ్డిని మీరు ఐదేళ్ల కోసం ఎన్నుకుంటే.. ఆయన నాలుగేళ్లకే రాజీనామా చేశారు. ఆయన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసమే రాజీనామా చేశారని హరీశ్ రావు ఆరోపించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. ప్రభాకర్ రెడ్డి గెలుపు మునుగోడు అభివృద్ధికి గెలుపంటూ హరీశ్ పిలుపునిచ్చారు. మరోవైపు మంత్రి జగగీశ్వర్ రెడ్డి కూడా చండూరు మండలంలో పర్యటించి.. కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేవారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ సతీమణి అరుణ కూడా ఉన్నారు.

దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడించిందని.. ఆ సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించారని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలు అందించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి స్పస్టం చేశారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. మిగిలిన పార్టీలకు బుద్ది చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. ఇక చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, మునుగోడు మండలాల్లో కూడా టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బతుకమ్మ ఆడుతూ, బోనాలు నెత్తిన పెట్టుకొని మహిళా కార్యకర్తలు ఉత్సాహంగా తిరుగుతున్నారు.

కాగా, మంత్రి కేటీఆర్ దీపావళి తర్వాత మునుగోడులో ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గట్టుప్పల మండలానికి కేటీఆర్‌ను బాధ్యుడిగా పార్టీ నియమించింది. కానీ కూసుకుంట్ల నామినేషన్ సమయంలో తప్ప కేటీఆర్ ఎక్కడా కనపడలేదు. దీంతో కార్యకర్తలు ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు గట్టుప్పల కార్యకర్తలు, నాయకులతో ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. నిత్యం వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. దీపావళి తర్వాత మండలంతో పాటు నియోజకవర్గం మొత్తం రోడ్ షోలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే రూపొందించారు. దీపావళి తర్వాత కేటీఆర్, హరీశ్ వంటి నేతలతో ప్రచారం మరింత జోరుగా సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  19 Oct 2022 8:13 AM IST
Next Story