త్రిముఖ పోరులో లాభపడేది టీఆర్ఎస్
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచ్ లు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా చేరికలుంటాయని తెలుస్తోంది. ఈ వలసలు కొనసాగితే.. అటు కాంగ్రెస్ తోపాటు ఇటు బీజేపీకి కూడా ఇది పెద్ద షాకవుతుంది.
మునుగోడులో పార్టీ మారుతోంది కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే. మరి కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి ఏంటి, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎటువైపు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి వీరాభిమానుల్లో ఆయన ఎక్కడుంటే, అక్కడే ఉంటామనే వారి సంఖ్య ఎంత..? ఇప్పుడీ లెక్కల్లో తలమునకలైపోయాయి ప్రధాన పార్టీలు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి టీఆర్ఎస్, బీజేపీ.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజేత అయిన కాంగ్రెస్ పార్టీకి, రెండో స్థానంలో ఉన్న టీఆర్ఎస్ కి మధ్య 10శాతం ఓట్ల తేడా ఉంది. అప్పట్లో బీజేపీకి కేవలం 5.8 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుంటే మధ్యలో నలిగిపోయిన వారి బలం కూడా బీజేపీకి లేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే బీజేపీ వైపు వచ్చేశారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తానంటున్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిన సమయంలో హస్తం గుర్తుకి 44.5 శాతం ఓట్లు పడ్డాయి. ఆ ఓటర్లలో సగం మంది రాజగోపాల్ రెడ్డితో బయటకు వచ్చినా బీజేపీ విజయానికి అవి ఏమాత్రం సరిపోవు. త్రిముఖ పోరులో లాభపడేది టీఆర్ఎస్ మాత్రమే. అందుకే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా తమవైపు రావాలనుకుంటోంది బీజేపీ. కనీసం సగానికి సగం మందినైనా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్.
వలసలు ఎటువైపు..?
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. అధికారికంగా ఇంకా బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. ఆయన కాషాయ కండువా కప్పుకునే రోజు, ఆయనతోపాటు ఎంతమంది బీజేపీలోకి వెళ్తారనేది ప్రశ్నార్థకం. ఈలోగా వీలైనంత ఎక్కువమందిని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేర్చుకోవాలని చూస్తోంది గులాబీ పార్టీ. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచ్ లు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా చేరికలుంటాయని తెలుస్తోంది. ఈ వలసలు కొనసాగితే.. అటు కాంగ్రెస్ తోపాటు ఇటు బీజేపీకి కూడా ఇది పెద్ద షాకవుతుంది. వలస ఓట్లపైనే ప్రధానంగా ఆధారపడింది బీజేపీ, ఆ ఓట్లను ఎలాగైనా చీల్చాలని చూస్తోంది టీఆర్ఎస్. ఈ రెండు పార్టీలకు కాకుండా తమ సంప్రదాయ ఓటుని తమ వద్దే ఉంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.
ఈ త్రిముఖ వ్యూహంలో.. గతంలో రాజగోపాల్ రెడ్డి వెంట నడిచినవారిలో ఎంతమంది ఆయనవైపే ఉంటారనేదానిపైనే బీజేపీ విజయం ఆధారపడి ఉంది. పక్క పార్టీల ఓట్లు పడకపోయినా.. గతంలో టీఆర్ఎస్ కి ఓట్లు వేసినవారంతా ఈసారి అదే పార్టీకి ఓట్లు వేసినా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలి ఆ రెండు పార్టీలు నష్టపోవడం గ్యారెంటీ. అందుకే టీఆర్ఎస్ రిలాక్స్ గా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ కుస్తీ పడుతోంది.