Telugu Global
Telangana

టీఆర్ఎస్ టార్గెట్ జీహెచ్ఎంసీ.. ఈ సారి ఒక్క అసెంబ్లీ సీటు కూడా తగ్గొద్దు

శివారు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుచుకున్నది. కాబట్టి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

టీఆర్ఎస్ టార్గెట్ జీహెచ్ఎంసీ.. ఈ సారి ఒక్క అసెంబ్లీ సీటు కూడా తగ్గొద్దు
X

తెలంగాణలో అప్పుడే ఎన్నికల మూడ్ వచ్చేసింది. అసెంబ్లీ ఎలక్షన్లకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వాటిని దృష్టిలో పెట్టుకొనే కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. జాతీయ స్థాయిలో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో ప్రస్తుతానికి పాత పేరు తోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గడిచిన ఏడు వారాల్లో రెండు సార్లు టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంట్ పార్టీ సమావేశాలు నిర్వహించి అందరినీ ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఇకపై రాజధానిలో ఏ ఎమ్మెల్యే కనిపించ కూడదని.. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కనీసం 70 సీట్లు గెలుచుకోవడం ద్వారా టీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టాలని భావిస్తోంది. పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర నాయకత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ ఎన్నికలకు ఎలా సిద్ధం కావలనే రూట్ మ్యాప్‌ను ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నిక ద్వారా కొన్ని కీలకమైన విషయాలను బీజేపీ తెలుసుకున్నది. అర్బన్ ఓటర్లు తప్ప గ్రామీణ ప్రాంతంలో బీజేపీకి ఓట్లు పడటం కష్టమేనని తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం గోషామహల్ సీటును మాత్రమే గెలిచింది. అప్పుడే ఆ విషయం బీజేపీకి అర్థం అయ్యింది. అయితే ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపుతో.. గ్రామీణ ప్రాంతంలో కూడా బీజేపీకి పట్టు దొరకిందని సంబరపడింది. కానీ, మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసిపోయింది.

అందుకే బీజేపీ రాష్ట్రంలోని అర్బన్ నియోజకవర్గాలను టార్గెట్‌గా పెట్టుకున్నది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో కనీసం 15 సీట్లు గెలవాలనేది లక్ష్యంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఇలాంటి వ్యూహంతో వస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ముందుగానే ఊహించారు. అందుకే ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో అర్బన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు, నాయకులకు సూచించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ బాధ్యతలను గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు అప్పగించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా అర్బన్ నియోజకవర్గాల్లోనే ఉంటుందని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇది కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. వీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో అంచనా వేయం కాస్త కష్టమే. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుచుకున్నది. కాబట్టి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పార్టీ అధినేత ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో త్వరలో పాదయాత్రలు, ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఇకపై ప్రతీ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పాదయాత్రలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రల సమయంలో నియోజకవర్గంలో ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకొని వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, సంబంధింత మంత్రి సహాయంతో అప్పటికప్పుడు పరిష్కరించగలిగితే మంచి ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇతర ఇబ్బందులు లేని వాటిని అప్పటికప్పుడు పరిష్కరించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన ఎంఐఎం ప్రభావం ఎక్కువ. దీంతో ముందుగా ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో పాదయాత్రలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని భావిస్తున్నది.

ఇటీవల బీజేపీ ఉత్తరాదిలో చేసినట్లుగానే.. ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హిందువల వ్యతిరేకిగా చిత్రించడం ప్రారంభించింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఇదే స్ట్రాటజీతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర, సభ పెట్టాలని భావించారు. అయితే హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వీలు ఉండదు. హైదరాబాద్‌లో కూడా గతంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు పాలయ్యారు. అందుకే అన్ని మతాల వారిని కలుపుకొని పోతూ.. వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రచారం చేయాలని టీఆరెస్ నిర్ణయించింది.

టీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు ప్రారంభించడానికి ముందే.. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నది. దీని వల్ల పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. అంతే కాకుండా కార్యకర్తలు, నాయకుల మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు ఉన్నా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పాదయాత్రలు ప్రారంభించనున్నారు. మొత్తానికి ఈ సారి ఒక్క సీటు కూడా బీజేపీ ఖాతాలో చేరకూడదని.. ఎంఐఎం సీట్లు పక్కన పెడితే.. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ఉన్నది.

First Published:  29 Nov 2022 6:40 AM IST
Next Story