విచ్ఛిన్న కారులపై కలాన్ని ఎక్కుపెట్టండి..
సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వడంతోపాటు, సమాజంలో మంచి వాతావరణం సృష్టిస్తుందని చెప్పారు కవిత. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సమాజంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలు తీసుకోవాలన్నారు.
విచ్ఛిన్నకారులపై కలాన్ని ఎక్కుపెట్టాలని కవులు, రచయితలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజం ఐక్యంగా ఉండేలా కృషి చేయాలని కోరారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల జాగరూకతతో ఉండాలన్నారు. సమాజాన్ని విడదీసే వాతావరణం ప్రస్తుతం మన మధ్య ఉందని, ఈ దేశంలో సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్య కారులు కృషి చేయాలని ఆమె కోరారు. ఢిల్లీలో జరిగిన సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ - ఇండియా టుడే సంస్థ సంయుక్తంగా సాహ్యిత పురస్కారాలను అందిస్తాయని ప్రకటించారు.
శబ్దమే శక్తి..
సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజపు గౌరవం పెరుగుతుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. యువతకు సాహిత్యం అర్థంకాదని, భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో యువత కలసి రాదనే అపోహ కొంతమందిలో ఉందని, కానీ, ఈ సాహిత్య సమ్మేళనం సదస్సుకి యువత పెద్ద సంఖ్యలో తరలి రావడం సంతోషంగా ఉందన్నారామె. దేశ సాహిత్యం భారత యువత చేతుల్లో భద్రంగా ఉందని భావిస్తున్నానని చెప్పారు. సాహిత్య ప్రేమికురాలిగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానన్నారు కవిత. ఒక శబ్దం లక్షాలది హృదయాలను కదిలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు.
సాహిత్యంతో జ్ఞానం..
సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వడంతోపాటు, సమాజంలో మంచి వాతావరణం సృష్టిస్తుందని చెప్పారు కవిత. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సమాజంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలు తీసుకోవాలన్నారు. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పామని చెప్పారు. ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతతో రచనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. దేశంలో సమాజాన్ని విడగొట్టడానికి, మనస్సులను దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కోడానికి కలానికి పదును పెట్టాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు కవిత. వారి కృషికి భారత్ జాగృతి ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.