Telugu Global
Telangana

రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్.1గా ఎదగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించినా ఎవరూ చూస్తూ ఊరుకోరని ఆమె అన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
X

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, ఇక్కడి ప్రభుత్వాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారు. అనేక విధాలుగా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్.1గా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించినా ఎవరూ చూస్తూ ఊరుకోరని ఆమె అన్నారు. తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు కవిత చెప్పారు. గురువారం ఆమె బాలాపూర్‌లోని గణేష్ మండపాన్ని సందర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

బాలాపూర్‌లో మీడియాతో కవిత మాట్లాడుతూ.. పేదల సంక్షేమాన్ని అడ్డుకోవాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్బుతమైన పథకాలు ఇక్కడ ఉన్నాయన్నారు. స్వామి దయవల్ల రాష్ట్రానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ప్రతీ ఏడాది బాలాపూర్ మండపం ఎలా ఉంటుందో.. ఈసారి లడ్డూ వేలం ఎంత వరకు వెళ్తుందో అని స్థానికులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటారని అన్నారు. బాలాపూర్ వినాయకుడిని సందర్శించుకోవడం తన అదృష్టమని అన్నారు. గ్రామస్తులే ఓ కమిటీగా ఏర్పడి 42 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తుండటం అభినందనీయం అన్నారు. ఈసారి అరుణాచల ఆకృతిలో ఏర్పాటు చేసిన మండపం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.

బాలాపూర్ మండపానికి ఎమ్మెల్సీ కవిత వెంట రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్ పేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నాయకురాలు వంగేటి లక్ష్మి ఉన్నారు.

First Published:  8 Sept 2022 6:32 PM IST
Next Story