అరవింద్..! నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా.. జాగ్రత్త- కవిత వార్నింగ్
ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కానీ, ఈరోజు వ్యక్తిగతంగానే చెబుతున్నా.. అరవింద్ గుర్తు పెట్టుకో.. మరోసారి నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా.. ఏం తమాషాగా ఉందా?.
తనపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మరోసారి తనపై నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో కొడుతా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిత్వం లేని వ్యక్తుల మాటలను పట్టించుకోకూడదనే ఇంతకాలం మౌనంగా ఉన్నామన్నారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్‌లో 186 మంది అభ్యర్థులను దింపి తనపై యాక్సిడెంటల్‌గా విజయం సాధించిన వ్యక్తి అరవింద్ అని ఫైర్ అయ్యారు. ఎన్నికల తర్వాత 186 మందిని బీజేపీలో చేర్చుకున్నారని కవిత వివరించారు.
అప్పటి నుంచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. నిజామాబాద్ పేరును కూడా నాశనం చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో అరవింద్ పనితీరు సున్నాగా ఉందన్నారు. లోక్‌సభలో సరాసరి తెలంగాణ ఎంపీలు 20 చర్చల్లో పాల్గొన్నారని.. అరవింద్ కేవలం 5 చర్చల్లో మాత్రమే పాల్గొన్నారని వివరించారు. సరాసరి తెలంగాణ ఎంపీలు 156 ప్రశ్నలు సంధిస్తే.. అరవింద్ మాత్రం 66 ప్రశ్నలు మాత్రమే వేశారని ఇదీ అతడి పనితీరు అని కవిత ఎద్దేవా చేశారు.
బాండ్ పేపర్లు రాసి ఇచ్చి ప్రజలను, రైతులను అరవింద్ మోసం చేశారని.. దీనిపై చీటింగ్ కేసులు పెడుతామన్నారు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్నట్టు ఫేక్ స్టడీ సర్టిఫికెట్ ఇచ్చారని.. అక్కడ ఆరా తీస్తే ఈయన చదవలేదని తేలిందన్నారు.. ఈ అంశంపై తానే ఈసీకి ఫిర్యాదు చేస్తానని కవిత చెప్పారు.
తాను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్టు అరవింద్ ఆరోపించారని.. ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్లు చెప్పినట్టు అరవింద్ చెబుతున్నారని.. దీన్ని బట్టే కాంగ్రెస్ నేతలతో అరవింద్‌కు సంబంధాలు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందంతోనే అరవింద్ ఎంపీగా గెలిచారన్నారు.
'' ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కానీ, ఈరోజు వ్యక్తిగతంగానే చెబుతున్నా.. అరవింద్ గుర్తు పెట్టుకో.. మరోసారి నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా.. ఏం తమాషాగా ఉందా?. మౌనంగా ఉంటే ఇష్టానుసారం మాట్లాడవుతావా?. ఈసారి ఎక్కడ పోటీ చేస్తావో చేయ్... వెంటబడి ఓడిస్తా.. ఇలాగే మాట్లాడితే తంతాం. మాకు మాటలొచ్చు. ఇంకోసారి నేను పార్టీ మారుతున్నట్టు అడ్డమైన కూతలు కూస్తే.. నిజామాబాద్ చౌరస్తాలోనే చెప్పుతో కొడుతా. ఒక ఆడ బిడ్డతో ఈ మాట అనిపించాడు అంటే వాడు ఎంత చీప్ ఫెలోనో ప్రజలే అర్థం చేసుకోండి'' అని కవిత వ్యాఖ్యానించారు. చాలా బాధతోనే తాను ఇలా మాట్లాడాల్సి వస్తోందని కవిత ఉద్వేగానికి లోనయ్యారు. లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉంటే దర్యాప్తు చేసుకుని నిరూపించాలని సవాల్ చేశారు.