Telugu Global
Telangana

ఎమ్మెల్యేల‌ కొనుగోలు కేసు నీరుగారిపోయినట్లేనా?

ఎందుకంటే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. బీజేపీకి మద్దతుగా ఉన్న ఎంపీల విషయాలను చూస్తేనే ఈ విషయం అర్ధమైపోతుంది.

ఎమ్మెల్యేల‌ కొనుగోలు కేసు నీరుగారిపోయినట్లేనా?
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ కొనుగోలు కేసు దర్యాప్తు ఇక నీరుగారిపోయినట్లే అనుకోవాలి. ఎమ్మెల్యేల‌కు ఎర కేసును ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ లీడర్ ప్రేమ్ చంద్రారెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు కోర్టులో పిటీషన్ వేశారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగుతుందన్న నమ్మకం లేదని తమ పిటీషన్‌లో చెప్పారు. దాంతో కేసును విచారించిన జడ్జి సిట్ దర్యాప్తును రద్దు చేశారు.

కొనుగోలు కేసును సిట్ బదులు సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఆదేశించింది హైకోర్టు. ఎప్పుడైతే కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించిందో అప్పుడే దర్యాప్తు నీరుగారిపోయిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. బీజేపీకి మద్దతుగా ఉన్న ఎంపీల విషయాలను చూస్తేనే ఈ విషయం అర్ధమైపోతుంది.

టీడీపీ రాజ్యసభ స‌భ్యులుగా సుజనా చౌదరి, సీఎం రమేష్‌పై వ‌చ్చిన ఆర్థిక ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఒకటికి పది సార్లు దాడులు చేశాయి. ఈ రోజో రేపో వీళ్ళ అరెస్టు ఖాయమన్నట్లుగా ఉండేది అప్పట్లో. అయితే ఎప్పుడైతే వీళ్ళు బీజేపీలో చేరిపోయారో అప్పటి నుండి వీళ్ళపై దాడులు లేవు, దర్యాప్తూ ముందుకు వెళ్ళటం లేదు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎంపీలు టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావుపైన కూడా ఎలాంటి చర్యలూ లేవు. వీళ్ళ విషయం ఇలాగుంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కూడా ఇదే పద్దతి.

రఘురాజు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల రుణాల పేరుతో దోచేసుకున్నట్లు సీబీఐ ఆధారాలతో సహా నిరూపించింది. అయినా ఇప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు లేవు. ఎందుకంటే ఈయన కూడా బీజేపీ పెద్దలతో అంటకాగుతున్నారు. బయట పార్టీల ఎంపీలనే ఇంతగా రక్షిస్తున్న పెద్దలు ఇక సొంత పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల్లో నిజాలు తేలుస్తారా? కాబట్టి ఎమ్మెల్యేల‌ కొనుగోలు కేసు దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై 'ఈగ' కూడా వాలదని అందరికీ అర్ధమైపోయింది.

First Published:  27 Dec 2022 11:33 AM IST
Next Story