Telugu Global
Telangana

ఎట్టకేలకు షర్మిలకు గుర్తింపు.. స్పీకర్ వద్దకు పంచాయితీ..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వైఎస్‌ షర్మిల.. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎట్టకేలకు షర్మిలకు గుర్తింపు.. స్పీకర్ వద్దకు పంచాయితీ..
X

తెెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు ఎమ్మెల్యే సీట్లున్న బీజేపీ కూడా వచ్చే దఫా అధికారం మాదేనంటోంది. పార్టీకి గుర్తింపు కూడా లేదని కేఏ పాల్ తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకుంటారు. ఈదశలో ఇక కొత్త పార్టీల‌కు చోటెక్కడిది. అందుకే ఉద్యమ నాయకుడు కోదండరాం లాంటి వారు కూడా కాడె పడేసేలా కనిపిస్తున్నారు. కానీ వైఎస్సార్టీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తన పార్టీకి మేలు చేస్తుందని అంటూ జనంలోకి వచ్చారు వైఎస్ షర్మిల. ఇన్నాళ్లూ షర్మిలని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పట్టించుకోలేదు. యాత్రలు చేస్తున్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టినా అధికార పార్టీనుంచి పెద్దగా స్పందన ఉండేది కాదు. అడపా దడపా మంత్రి నిరంజన్ రెడ్డి వంటివారు చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నా టీఆర్ఎస్ ఎప్పూడూ వైఎస్సార్టీపీని పోటీగా చూడలేదు, కనీసం పట్టించుకోలేదు కూడా. కానీ ఇప్పుడు షర్మిలను టీఆర్ఎస్ నేతలు గుర్తించారు.

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వైఎస్‌ షర్మిల.. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఆరోపించారు. స్పీకర్ ను కలిసి షర్మిలపై ఫిర్యాదు చేశారు.

ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం చర్యలు..

చట్ట సభల సభ్యుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశముంటుంది. దీనికోసం ప్రివిలేజ్ కమిటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, షర్మిలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

First Published:  14 Sept 2022 12:30 PM IST
Next Story