Telugu Global
Telangana

ఏదైనా జరగొచ్చు.. సిద్ధంగా ఉండండి : తుమ్మల నాగేశ్వరరావు

ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చని.. కార్యకర్తలు అందరూ సిద్దంగా ఉండాలని తుమ్మల వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ మారతాననే హింట్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఏదైనా జరగొచ్చు.. సిద్ధంగా ఉండండి : తుమ్మల నాగేశ్వరరావు
X

మాజీ మంత్రి, టీఆర్ఎస్‌ కీలక నేత, ఖమ్మం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఝలక్ ఇవ్వబోతున్నారా? టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వలస బాట పట్టనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా తన అనుచరులు, కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు తుమ్మల పార్టీ మారుతారనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చని.. కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని తుమ్మల వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ మారుతాననే హింట్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నేత. టీడీపీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తుమ్మల.. చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తన పాత మిత్రులందరినీ కేసీఆర్ పార్టీలోకి తీసుకొచ్చారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా టీఆర్ఎస్‌లో చేర్చుకొని మంత్రిని చేశారు. ప్రస్తుతం ఖమ్మం టీఆర్ఎస్‌లో ఉన్న పాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాదాపు తుమ్మల అనుచరులే అంటే అతిశయోక్తి కాదు.

కాగా, గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సొంత టీఆర్ఎస్ పార్టీ నాయకులే తనను మోసం చేసి ఓడించారని తుమ్మల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పాలేరు నియోజకవర్గంలో నామా వర్గం తన ఓటమికి పని చేసిందని అప్పట్లో తుమ్మల ఆరోపించారు. తాను ఎంతో అభివృద్ధి చేసినా.. పార్టీ నాయ‌కులు మోసం చేయ‌బ‌ట్టే ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చాలా రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

పాలేరు టికెట్ కోసం ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా పోటీ పడుతున్నారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని ఉపేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మరోవైపు తుమ్మల వర్గం తమ నాయకుడికే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటోంది. దీంతో తుమ్మల తన అనుచరుల దగ్గర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గతంలో తాను రాష్ట్రమంతటా దృష్టిపెట్టానని.. ఈసారి మాత్రం కేవలం పాలేరుకే పరిమితమ‌వుతానని చెప్పుకొచ్చారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల‌ని తుమ్మల సూచించారు. ఎప్పుడైనా పిడుగు పడొచ్చంటూ తుమ్మ‌ల‌ అనడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన పార్టీ మారుతారనే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు.. బీజేపీలోకి వెళ్తారా? ఒక వేళ వెళ్తే ఆ పార్టీలో ఇమడగలుగుతారా అనే అనుమానాలున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే వార్తలు వచ్చినా.. ఆయన వాటిని ఖండించారు. ఎన్నికలు దగ్గరకు వస్తే కానీ.. ఎవరు పార్టీ నుంచి జంప్ అవుతారనే దానిపై స్పష్టత రాదు.

First Published:  3 Aug 2022 6:00 PM IST
Next Story