9వ రౌండ్ తో గెలుపు పక్కా.. టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
రౌండ్ రౌండ్ కీ టీఆర్ఎస్ కి స్పష్టమైన ఆధిక్యం రావడంతో బీజేపీ పూర్తిగా చాప చుట్టేసింది. టీవీ డిబేట్లనుంచి కూడా బీజేపీ నేతలు వెనక్కి వెళ్లిపోతున్నారు.
మునుగోడు ఫలితాలు టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటాయని సర్వేలన్నీ చెబుతున్నా.. ఈరోజు ఉదయం ఎందుకో కాస్త హడావిడి నడిచింది. తొలిరౌండ్ లో టీఆర్ఎస్ కి స్పష్టమైన ఆధిక్యం వచ్చినా 2, 3 రౌండ్ల రిజల్ట్ తర్వాత బీజేపీకి హుషారొచ్చింది. టీఆర్ఎస్ ని నిలువరించబోతున్నామనే కాన్ఫిడెన్స్ వారిలో కనిపించింది. రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద మకాం వేశారు. పోరు హోరాహోరీగా సాగుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయనకు చుక్కలు కనిపింయి. ఐదో రోండ్, ఆరో రౌండ్, ఏడు, ఎనిమిది, తొమ్మిది.. ఇలా రౌండ్లు మారుతున్నాయే కానీ, మెజార్టీ మాత్రం రావడంలేదు. కనీసం టఫ్ ఫైట్ కూడా సాధ్యం కాలేదు. అంతకంతకూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆధిక్యం పెరుగుతోంది. తొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ కి 4వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.
గెలుపు దిశగా టీఆర్ఎస్..
9 రౌండ్లకే 4వేల ఓట్ల ఆధిక్యం రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొత్తం 15రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 9 పూర్తయ్యాయి. మిగిలిన ఆరు రౌండ్లలో కూడా టీఆర్ఎస్ కే స్పష్టమైన మెజార్టీ వస్తుందనే అంచనాలున్నాయి. ఆ ఆరు రౌండ్ల లెక్కింపు టీఆర్ఎస్ కి మంచి పట్టున్న మండలాల్లో మిగిలుంది. దీంతో టీఆర్ఎస్ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
ఓటమి ఊహించి రచ్చ చేస్తున్న బీజేపీ..
అయితే ఓటమిని ఊహించి బీజేపీ ముందుగానే రచ్చ మొదలు పెట్టింది. ఫలితాలు ఆలస్యమవుతున్నాయని, దానికి పరోక్ష కారణం టీఆర్ఎస్ అంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. చివరకు కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకుల వల్లే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తేలడంతో బీజేపీ సైలెంట్ అయింది. ఇప్పుడు రౌండ్ రౌండ్ కీ టీఆర్ఎస్ కి స్పష్టమైన ఆధిక్యం రావడంతో బీజేపీ పూర్తిగా చాప చుట్టేసింది. టీవీ డిబేట్లనుంచి కూడా బీజేపీ నేతలు వెనక్కి వెళ్లిపోతున్నారు.