Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డిని డిస్ క్వాలిఫై చేయాల్సిందే..

రాజగోపాల్ రెడ్డికి వచ్చిన కాంట్రాక్ట్ వర్కుల్లో ఈటల రాజేందర్, వివేక్ కి కూడా వాటా ఇస్తానని చెప్పాడని ఆరోపించారు టీఆర్ఎస్ నేతలు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు.. కాంట్రాక్ట్ డబ్బుల్ని పంచుకుంటూ అనవసరంగా ఉప ఎన్నిక తెచ్చారంటూ మండిపడ్డారు.

రాజగోపాల్ రెడ్డిని డిస్ క్వాలిఫై చేయాల్సిందే..
X

"ఉప ఎన్నికకు 6 నెలల ముందు 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు నాకు వచ్చాయి."

ఈ మాటలన్నది ఎవరో కాదు, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ త‌ర‌ఫున పోటీచేసే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే బీజేపీతో తన లాలూచీ ఆయన బయటపెట్టుకున్నారు. ఉప ఎన్నిక రావడానికి కారణమేంటో చెప్పేశారు. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని తేటతెల్లమైంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే చర్య అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి ఇది విరుద్ధమని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని, డిస్ క్వాలిఫై చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కి వినతిపత్రం అందించారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.. ఎన్నికల ప్రధాన అధికారిని కలసి విజ్ఞప్తి చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీజేపీ నుంచి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకున్నానని ఓ టీవీ ఛానల్ డిబేట్ లో చెప్పాడని, దీని ప్రకారం అతనిపై అనర్హత వేటు వేయాలన్నారు. ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగినట్టు స్పష్టమైందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి పోటీకి అనర్హుడంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమే మారిపోతుందని అన్నారు.

ఈటలకు, వివేక్ కు కూడా వాటా..

రాజగోపాల్ రెడ్డికి వచ్చిన కాంట్రాక్ట్ వర్కుల్లో ఈటల రాజేందర్, వివేక్ కి కూడా వాటా ఇస్తానని చెప్పాడని ఆరోపించారు టీఆర్ఎస్ నేతలు. ఇలా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు.. కాంట్రాక్ట్ డబ్బుల్ని పంచుకుంటూ అనవసరంగా ఉప ఎన్నిక తెచ్చారంటూ మండిపడ్డారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని.. మోదీ, అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రజలకోసం ఏనాడూ రాజగోపాల్ రెడ్డి ఏ పనీ చేయలేదని, కానీ ఆయన వద్ద పైసల అహంకారం ఉందని, కాంట్రాక్ట్ డబ్బులతో అది మరింత పెరిగిందని, ఆ అహంకారంతోనే పైసలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని, ఇలాంటి కుటిల యత్నాలను ముందుగానే అడ్డుకోవాలన్నారు. ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

First Published:  9 Oct 2022 5:25 PM IST
Next Story