Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లే 'పేదవాడు'

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన భార్యతో కలిపి రూ. 7.73 కోట్ల స్థిరాస్తులు, రూ. 6 కోట్ల చరాస్తులు.. మొత్తం రూ. 13.78 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాయి.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లే పేదవాడు
X

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు శుక్రవారం (అక్టోబర్ 14)తో ముగుస్తున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే. శంకర్ నాయక్ ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా, ఈ రోజు మరోసారి స్రవంతి కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆమె వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉంటారని సమాచారం. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా వీళ్లు ముగ్గురు సమర్పించిన అఫిడవిట్లు చూస్తే.. కూసుకుంట్లే తక్కువ ఆస్తి కలిగిన వ్యక్తిగా స్పష్టమవుతోంది.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన భార్యతో కలిపి రూ. 7.73 కోట్ల స్థిరాస్తులు, రూ. 6 కోట్ల చరాస్తులు.. మొత్తం రూ. 13.78 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి పేరుతో రూ. 3.78 కోట్ల చరాస్తులు, రూ. 3.89 కోట్ల స్థిరాస్తులు మొత్తం రూ. 7.68 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ప్రభాకర్ రెడ్డికి రూ. 1.78 కోట్ల అప్పులు, ఆయన భార్య అరుణకు రూ. 22.92 లక్షల అప్పు ఉన్నది. ఇవి రెండు కూడా చేబదులు రూపంలో తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఆస్తుల కంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆస్తులు తగ్గిపోయాయి. 2018లో ఆయనకు రూ. 19.28 కోట్ల ఆస్తులు ఉండగా.. ఇప్పుడు రూ. 13.78 కోట్లకు తగ్గిపోయింది.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరు మీద మొత్తం రూ. 222.66 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2018తో పోల్చితే ఆయన ఆస్తి రూ. 24.55 కోట్లు పెరిగింది. కాగా, రాజగోపాల్‌కు రూ. 61.54 కోట్ల అప్పు ఉన్నది. బ్యాంకులు, ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఈ మేరకు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేరుతోరూ. 52.44 కోట్ల ఆస్తి ఉన్నది. కాగా, 2018లో రాజగోపాల్ రెడ్డి పేరుతో రూ. 24.55 కోట్ల ఆస్తులు, భార్య పేరుతో రూ. 289.75 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ, ఈ సారి రాజగోపాల్ ఆస్తులు భారీగా పెరగగా.. ఆయన భార్య పేరుతో ఉన్న ఆస్తులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇద్దరి ఆస్తులు కలిపితే 2018 కంటే ఇప్పుడు రూ. 38 కోట్ల మేర తగ్గిపోయినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మొత్తం ఆస్తులు రూ. 25.61 కోట్లుగా పేర్కొన్నారు. ఆమె పేరుపై రూ. 65.23 లక్షల చరాస్తులు, రూ. 24.96 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక తన భర్తతో కలిపి రూ. 1.23 కోట్ల చరాస్తులు, రూ. 39.77 కోట్ల స్థిరాస్తులు మొత్తం రూ. 41 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వీరి ముగ్గురిలో పేదవానిగా చెప్పుకోవచ్చు.

మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై గతంలో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. 2012 సెప్టెంబర్‌లో 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు ఈ కేసులో ఒక నెల జైలు శిక్ష కూడా విధించింది. అయితే ఆ తర్వాత ఆ శిక్షపై పిటిషన్ దాఖలు చేశారు. లోక్ అదాలత్‌లో రెండు పార్టీలు రాజీకి రావడంతో ఆ కేసు రద్దు అయ్యింది.

First Published:  14 Oct 2022 7:37 AM IST
Next Story