Telugu Global
Telangana

షర్మిల పాదయాత్రలో అలజడి.. బస్సుకు నిప్పంటించిన దుండగులు

ప్రస్తుతం ఆమె వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో పర్యటిస్తోంది. ఇక్కడ బస్సుకు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న వైఎస్సార్‌టీపీ కార్యకార్తలు నీళ్లు చల్లి మంటలు ఆర్పారు.

షర్మిల పాదయాత్రలో అలజడి..  బస్సుకు నిప్పంటించిన దుండగులు
X

వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె పాదయాత్ర సాగిస్తోంది. పలుమార్లు ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఇదిలా ఉంటే షర్మిల వెనక బలమైన టీం ఉందని.. నిత్యం వార్తల్లో ఉండేందుకు వాళ్లే ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని కూడా సమాచారం.

గతంలో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి, షర్మిల మధ్య ఘాటు వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి కూడా.. ఓ దశలో ఇద్దరూ పరిధులు దాటి మరీ తిట్టుకున్నారు. షర్మిల పాదయాత్రకు ప్రజల్లో ఎంతమేర స్పందన వస్తుందో తెలియదు గానీ.. ఆమె మాత్రం వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు పాదయాత్రలో భాగంగా వెళ్తున్న బస్సుకు నిప్పంటించారు. కాగా, ఇది టీఆర్ఎస్ శ్రేణుల పనేనని షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో పర్యటిస్తోంది. ఇక్కడ బస్సుకు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న వైఎస్సార్‌టీపీ కార్యకార్తలు నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. మరోవైపు నర్సంపేట, జల్లి గ్రామాల్లో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఇటీవల షర్మిల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బస్సుకు నిప్పంటించడం గమనార్హం. ఈ ఘటనపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి.

First Published:  28 Nov 2022 10:16 AM
Next Story