Telugu Global
Telangana

రాజగోపాల్.. రాజకీయ సన్యాసం ఎప్పుడు..?

రాజగోపాల్.. రాజకీయ సన్యాసం ఎప్పుడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని సెటైర్లు పేలుస్తున్నారు.

రాజగోపాల్.. రాజకీయ సన్యాసం ఎప్పుడు..?
X

మునుగోడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఇటీవల రాజగోపాల్ రెడ్డి ధీమాగా మీడియా ముందు చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా తాను ఘన విజయం సాధిస్తానని, మునుగోడులో తాను ఓడిపోతే ఇక తనకు రాజకీయాల్లో ఏ పదవీ వద్దని అన్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజగోపాల్.. రాజకీయ సన్యాసం ఎప్పుడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని సెటైర్లు పేలుస్తున్నారు.

రెంటికీ చెడ్డ రేవడి..

రాజగోపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ కి కాకుండా, ఇటు మునుగోడుకి కాకుండా పోయారని అంటున్నారు నెటిజన్లు. ఏడాది ముందే ఎమ్మెల్యే పదవి పోగొట్టుకోడానికి రాజగోపాల్ రెడ్డి అంత ఉబలాటపడ్డారెందుకని ప్రశ్నిస్తున్నారు. తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారని గుర్తు చేస్తున్నారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకోసం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని వదిలేసుకున్నారని, ఫార్టీ పర్సెంట్ కమీషన్లు గుంజే అలవాటున్న బీజేపీ.. రాజగోపాల్ రెడ్డికి ఎంత ముట్టజెబుతుందో అనుమానమేనంటూ జోకులు పేలుస్తున్నారు.

కిం కర్తవ్యం..?

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి కాబట్టి.. రాజగోపాల్ రెడ్డి హ్యాపీగా ప్రయాణానికి బట్టలు సర్దుకుంటుంటారు. కానీ వాట్ నెక్స్ట్. రాజకీయంగా రాజగోపాల్ రెడ్డి జీవితం సమాధి అయినట్టేనా అనే అనుమానాలు వినపడుతున్నాయి. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉంటూ రాజకీయాలు చేయలేరు. పోనీ ఇద్దరూ ఒకేవైపు వచ్చినా 'కోవర్ట్ రెడ్డి'లు అనే పేరు ఆల్రడీ కేటీఆర్ పెట్టేశారు కాబట్టి వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ఎన్నిక వరకు కాంట్రాక్ట్ సొమ్ములు కుమ్మరించిన రాజగోపాల్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో ఆమాత్రం ఖర్చుకు వెనకాడొచ్చు. దాదాపుగా ప్రజల్లో రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేక వచ్చింది కాబట్టి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భవిష్యత్తులో ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనే విశ్లేషణలు వినపడుతున్నాయి. అంటే దాదాపుగా రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసానికి రెడీ అయిపోవచ్చన్నమాట.

First Published:  6 Nov 2022 11:59 AM GMT
Next Story