Telugu Global
Telangana

ఎమ్మెల్యే హరిప్రియ ప్రసవం.. ఖమ్మం టీఆర్ఎస్‌లో రచ్చ రచ్చ

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హరిప్రియ ప్రసవం విషయం సోషల్ మీడియాలో రెండు రోజుల పాటు రచ్చ చేసింది. అనుచరుల అత్యుత్సాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే హరిప్రియ ప్రసవం.. ఖమ్మం టీఆర్ఎస్‌లో రచ్చ రచ్చ
X

ఇంటర్నెట్, వాట్సప్ వినియోగం పెరిగిపోయిన తర్వాత ఏ వార్తనైన క్షణాల్లో అందరికీ అందించాలని చాలా మంది ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, కార్యకర్తలు తమకు అనుకూలమైన వార్తలకు కాసింత సొంత పైత్యం జోడించి ప్రచారం చేసుకుంటుంటారు. ఈ విషయంలో ఏ పార్టీ కార్యకర్తలు కూడా అతీతులు కారు. దీంతో సామాన్య ప్రజలకు అసలు విషయం ఏంటో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రసవం విషయం కూడా ఇలా సోషల్ మీడియాలో రెండు రోజుల పాటు రచ్చ చేసింది. ఆ ఎమ్మెల్యే దంపతుల ఆనందం కాస్తా ఆవిరయ్యేలా వాళ్ల అనుచరులు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్, హరిసింగ్ బానోత్ దంపతులకు 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత పండంటి ఆడబిడ్డ అక్టోబర్ 5న జన్మించింది. అదే రోజు దసరా కావడం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏర్పడటంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు చెప్పడంతో ఆ బిడ్డకు 'భారతి సుచిత్ర ప్రియ' అని పేరు పెట్టమని సూచించినట్లు హరి సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే దంపతులకు ఆడపిల్ల పుట్టగానే ఆమె అభిమానులు, అనుచరులు ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే కొంత మంది అత్యుత్సాహవంతులైన కార్యకర్తలు ఈ వార్తకు కొంచెం మసాలా యాడ్ చేశారు.

ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకుంది. హ్యాట్సాఫ్ హరిప్రియా అంటూ వాట్సప్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్యే కావడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. కానీ వేరే పార్టీ కార్యకర్తలు ఇదంతా అబద్దమనీ, ఎమ్మెల్యే అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మరో పోస్టు పెట్టారు. వాస్తవానికి హరిప్రియ ఇల్లెందులోని రావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్ కల్పన పర్యవేక్షణలో డెలివరీ అయ్యారు. కానీ, ఎమ్మెల్యే అనుచరులు మాత్రం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలే మారిపోయాయి. ఇదంతా ఎమ్మెల్యే చలవే అంటూ పోస్టులు పెట్టడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఇతర పార్టీ కార్యకర్తలే కాకుండా టీఆర్ఎస్ పార్టీలోని వాళ్లు కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాట్సప్ యుద్ధం ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ పార్టీ పరువు తీయడం ప్రారంభించారు.

ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఇలా అభిమానులు రచ్చ రచ్చ చేయడంతో ఎమ్మెల్యే దంపతులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. వాస్తవ విరుద్దంగా ఉండే ఏ విషయాలపైనా పార్టీ కార్యకర్తలు పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యే దంపతుల పర్సనల్ విషయాన్ని వదిలేయాలని.. అనసవరంగా ఎవరికీ ఆనందం లేకుండా చేస్తున్నారని చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.

First Published:  9 Oct 2022 7:19 AM GMT
Next Story