సబ్ రిజిస్ట్రార్ లంచావతారం.. మంత్రి సీతక్కకు పెద్ద కష్టం
తస్లీమా తన తండ్రి పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించారు. ఆ ట్రస్ట్ గురించి కూడా మంత్రి సీతక్క చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. సీతక్కతో ఆమె సెల్ఫీలు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నస్రీన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తస్లీమా సోషల్ మీడియా స్టార్ కావడంతో ఆమెతో సంబంధం ఉన్న అందరి పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి సీతక్కపై ట్రోలింగ్ మొదలైంది. మంత్రి సీతక్కతో కలసి తస్లీమా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలో తండా వాసులకు వారిద్దరూ కలసి వెళ్లి స్వయంగా నిత్యావసరాలు అందించారు. దీనికోసం వారు కొండకోనల్లోకి నడచి వెళ్లేవారు. తస్లీమా ఏసీబీకి పట్టుబడటంతో ఆమె సామాజిక సేవ అంతా డ్రామా ఆంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. పనిలో పనిగా సీతక్కను కూడా ట్రోల్ చేస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల ద్వారా విపరీత ప్రచారం పొందారు తస్లీమా నస్రీన్. ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా 12 ఏళ్లు ఆమె విధులు నిర్వర్తించారు. గతేడాది బదిలీల్లో మహబూబాబాద్ కి వచ్చారు. సెలవలు వస్తే చాలు మహిళలతో కలిసి వరి నాట్లు వేయడం, పత్తి ఏరడం, మిర్చి తెంపడం వంటి పనులకు వెళ్లేవారు, కూలీలతో కలసి ఆమె పని చేసేవారు, ట్రాక్టర్ ఎక్కి దుక్కిదున్నేవారు. ఆ ఫొటోలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సహజంగా సబ్ రిజిస్ట్రార్ స్థాయి ఆఫీసర్ కచ్చితంగా కారులోనే ఆఫీస్ కి వస్తారు. కానీ తస్లీమా ఆటో, బస్సు, స్కూటర్.. ఇలా రోజుకో వాహనంలో వస్తూ ఆ విధంగా కూడా ప్రచారం పొందేవారు.
తస్లీమా తన తండ్రి పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించారు. ఆ ట్రస్ట్ గురించి కూడా మంత్రి సీతక్క చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. సీతక్కతో ఆమె సెల్ఫీలు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకులను కూడా ఆమె కలిసేవారు. సామాజిక సేవ తర్వాత ఇక రాజకీయ ఎంట్రీయే మిగిలుంది అనుకుంటున్న టైమ్ లో ఆమె ఇలా ఏసీబీకి చిక్కడం విశేషం. రెడ్ హ్యాండెడ్ గా కరెన్సీ నోట్లతో పట్టుకోవడంతో.. ఇది కుట్ర అని ఆరోపించడానికి కూడా అవకాశం లేకపోయింది. దీంతో తస్లీమాతోపాటు, ఆమెతో సన్నిహితంగా ఉన్నవారంతా సోషల్ మీడియాకు బలైపోతున్నారు.