Telugu Global
Telangana

గన్‌పార్క్‌ వద్ద ప్రొఫెసర్‌ సాయిబాబాకు నివాళులు

సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ అస్పత్రికి సాయిబాబా భౌతికకాయాన్ని అప్పగిస్తామన్న కుటుంబసభ్యులు

గన్‌పార్క్‌ వద్ద ప్రొఫెసర్‌ సాయిబాబాకు నివాళులు
X

ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా మృతదేహానికి హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద సన్నిహితులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. జోహార్‌.. జోహార్‌ సాయిబాబా అంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని నినదించారు. వారం రోజుల కిందట అనారోగ్య కారణాలతో నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన సాయిబాబా.. చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. అభిమానుల సందర్శనార్థం గన్‌పార్క్‌లో సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచిన కుటుంబసభ్యులు అనంతరం మౌలాలి లోని స్వగృహానికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి పార్థివదేహాన్ని అప్పగిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. హక్కుల నిర్బంధమే సాయిబాబా మృతికి కారణమని పౌర హక్కుల సంఘాల నేతలు ఆరోపించారు.

మరోవైపు గన్‌పార్క్‌ వద్ద సాయిబాబాకు 5 నిమిషాలు సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు చెప్పారు. దీనికి పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులకు అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి సమావేశం ఏర్పాటు చేస్తామని అభిమానులు చెప్పారు.

సీపీఐ నేత నారాయణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని సాయిబాబాకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు చదివేవారు మేధావులు కాదు.. సమాజాన్ని చదివిన వారు మేధావులు అన్నారు. సాయిబాబాను పదేళ్లు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ చెప్పారు.

సాయిబాబా భౌతికకాయానికి హరీశ్‌రావు, కోదండరామ్‌ నివాళులు

సాయిబాబా భౌతికకాయానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. జైలు నుంచి వచ్చిన కొన్నాళ్లకే సాయిబాబా మరణించడం బాధాకరం అన్నారు. సమాజంలో మార్పు, హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా అన్నారు. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరం అన్నారు.

ఎమ్మెల్సీ కోదండారామ్‌ మాట్లాడుతూ.. సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణతో వ్యవహరించిందని మండిపడ్డారు. ఆయన మృతికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

First Published:  14 Oct 2024 4:45 AM GMT
Next Story