పాలమూరును వీడుతున్న చిక్కుముడులు.. ఏపీ దరఖాస్తు తిరస్కరించిన ట్రైబ్యునల్
గోదావరి నుంచి మళ్లించే నీటిని కేటాయించుకోవడం వల్ల దిగువన ఉన్న రాయలసీమ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. దీనిపై తెలంగాణ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించింది. దీనిపై సరైన వేదికకు వెళ్లే స్వేచ్ఛ ఏపీకి ఉందని స్పష్టం చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 75 శాతం నీటి లభ్యత కింద 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 18న జీఓ 246ను రిలీజ్ చేసింది. చిన్న నీటి వనరుల కింద కేటాయింపు ఉండీ వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి నుంచి పోలవరం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే నీటిలో నాగార్జున సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 90 టీఎంసీలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించింది. అయితే ఈ ఉత్తర్వులను నిలిపివేసేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. మిషన్ కాకతీయ కింద చెరువులను మరమ్మతు చేసి మొత్తం నీటిని తెలంగాణ వినియోగించుకుంటోందని..కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు వివరాలే దీనికి సాక్ష్యమని పేర్కొంది.
గోదావరి నుంచి మళ్లించే నీటిని కేటాయించుకోవడం వల్ల దిగువన ఉన్న రాయలసీమ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. దీనిపై తెలంగాణ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ వాదనను తోసిపుచ్చింది. నీటిని మళ్లీ కేటాయించుకోవడం అక్రమమేమి కాదని వాదించింది. ఉమ్మడి ఏపీ చేపట్టిన ప్రాజెక్టు తప్ప కొత్తది కాదని, 2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్ సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి చర్చ జరిగిందని గుర్తుచేసింది. ప్రాజెక్టును నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్ చెప్పలేదంది.
రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్.. తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులో వరద నీటి వినియోగమే అన్నారు తప్ప.. 75 శాతం నీటి లభ్యత కింద వినియోగించుకోవచ్చని చెప్పలేదని పేర్కొంది. ఇది రాష్ట్ర పునర్విభజనకు ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అన్న వాదనతోనూ ఏకీభవించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని యాక్ట్ 6 సెక్షన్ 89 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు తమ పరిధిలోకి రాదని ట్రైబ్యునల్ పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా కచ్చితమైన నీటి కేటాయింపులు జరగకపోతే చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలో ఆపరేషన్ ప్రొటోకాల్ రూపొందించడం మాత్రమే తమ పని అని స్పష్టం చేసింది. దీనిపై సరైన వేదికకు వెళ్లడానికి ఏపీకి స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ట్రైబ్యునల్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం పరిగణనలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అటవీ, పర్యావరణ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ తదితర అనుమతులు ఇప్పటికే వచ్చాయి. నీటి లభ్యతకు సంబంధించి సీడబ్ల్యూసీ అనుమతి రావాల్సి ఉంది.
ఇక మధ్యంతర దరఖాస్తును బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కొట్టివేయడం పాలమూరు విజయమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు.
*