Telugu Global
Telangana

సెప్టెంబర్‌ 3 నుంచి టీచర్ల బదిలీలు.. రేపో, ఎల్లుండో షెడ్యూల్‌..!

కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలు నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.

సెప్టెంబర్‌ 3 నుంచి టీచర్ల బదిలీలు.. రేపో, ఎల్లుండో షెడ్యూల్‌..!
X

ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రివ్యూ నిర్వహించారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ఇందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సమాచారం ఇవ్వాలని.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్‌ 3 లోపు టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్సఫర్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రేపు లేదా ఎల్లుండి ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలు నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బదిలీలను కొనసాగించడానికి అనుమతించింది. తెలంగాణ విద్యాచట్టంలోని సెక్షన్‌ 78 (2) ప్రకారం బదిలీలతోపాటు పదోన్నతులిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.

బదిలీల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనంగా 10 పాయింట్లు కేటాయించడానికి సరైన కారణం కనిపించలేదని పేర్కొంది. ఉపాధ్యాయ దంపతులను మాత్రం కలిసి ఉండనివ్వాలని, వారికి సంబంధించిన నిబంధనలో జోక్యం చేసుకోవడం లేదని హైకోర్టు తెలిపింది. అన్ని బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. నిబంధనల చెల్లుబాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ విచారణను వాయిదా వేసింది.

*

First Published:  31 Aug 2023 8:19 PM IST
Next Story