Telugu Global
Telangana

పచ్చదనానికి ఢోకా లేదు.. ఫార్ములా-ఇ కోసం చెట్ల ట్రాన్స్ లొకేషన్

ఇప్పటికే దాదాపుగా 70శాతం చెట్లను తరలించారు, మిగిలిన 30 శాతం పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెబుతున్నారు అధికారులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఇ రేస్ మొదలయ్యే నాటికి స్థానాలు మారిన ఆ చెట్లు చిగురిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.

పచ్చదనానికి ఢోకా లేదు.. ఫార్ములా-ఇ కోసం చెట్ల ట్రాన్స్ లొకేషన్
X

వచ్చే ఏడాది హైదరాబాద్ లో జరగబోతున్న ఫార్ములా-ఇ రేస్ కోసం ట్రాక్ నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తవుతోంది. అయితే ఈ ట్రాక్ నిర్మాణంలో కొన్నిచోట్ల చెట్లను తొలగిస్తుండటంతో పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలు పెట్టాయి. అయితే చెట్లను ఎక్కడా తొలగించడంలేదని, కేవలం వాటి స్థానాలను మారుస్తున్నామని (ట్రాన్స్ లొకేట్) తెలిపారు అధికారులు. దాదాపు 20 భారీ వృక్షాలకు ఇలా స్థాన చలనం కలిగిస్తున్నారు అధికారులు. ట్రాన్స్ లొకేషన్ వల్ల ఏ ఒక్క చెట్టు కూడా చనిపోదు. నూటికి నూరుశాతం తిరిగి అది కొత్త స్థలంలో చిగురులు వేస్తుంది. ఇప్పటికే విజయవంతమైన ఈ ప్రక్రియను ఫార్ములా-ఇ రేస్ ట్రాక్ సిద్ధం చేయడంలో భాగంగా మరోసారి వినియోగంలోకి తెస్తున్నారు అధికారులు.

అన్నీ పక్కాగా..

తూతూ మంత్రంగా చెట్లను ట్రాన్స్ లొకేట్ చేయడంలేదు, నిబంధనలు అనుసరించి అన్నీ పక్కాగా చేస్తున్నారు అధికారులు. ట్రీ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు తొలగించాల్సిన చెట్లను జూలై 19న పరిశీలించారు. తనిఖీ చేసి నివేదిక సిద్ధం చేశారు. దీనికి జిల్లా ఫారెస్ట్ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కులలోకి మారుస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 70శాతం చెట్లను తరలించారు, మిగిలిన 30 శాతం పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఇ రేస్ మొదలయ్యే నాటికి స్థానాలు మారిన ఆ చెట్లు చిగురిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.

దేశంలోనే తొలిసారి..

ఫార్ములా-ఇ రేసులు కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసమే జరుగుతాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 9 నగరాల్లో ఈ రేస్ లు జరిగాయి. భారత్ లో తొలిసారిగా నిర్వాహకులు హైదరాబాద్ ని ఎంపిక చేసుకోవడం విశేషం. ఫార్ములా-1 రేస్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ లు ఉంటాయి, కానీ ఫార్ములా-ఇ రేస్ కోసం సాధారణ రోడ్లపైనే ట్రాక్ లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో చెట్లకు ఎలాంటి నష్టం లేకుండా ట్రాక్ ఏర్పాటు చేయాలని చూసినా అది సాధ్యం కాలేదు. చివరకు చెట్లను ట్రాన్స్ లొకేట్ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించారు అధికారులు. పర్యావరణానికి ఏమాత్రం నష్టం లేకుండా ట్రాక్ రెడీ చేస్తున్నారు. పర్యావరణ హిత కార్ల రేస్ కోసం పర్యావరణ హితమైన నిర్ణయం తీసుకున్నారు.

First Published:  8 Nov 2022 10:00 AM GMT
Next Story