హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం.. - 28 నుంచి అమలులోకి
Hyderabad Traffic Rules: రాంగ్ రూట్లో ప్రయాణిస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిబంధనలను ఈ నెల 28 నుంచి అమలు చేయనున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేస్తున్నారు. ఇకపై రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. రహదారి జంక్షన్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటం గమనించిన అధికారులు దీనిని నియంత్రించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాంగ్ రూట్లో ప్రయాణిస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిబంధనలను ఈ నెల 28 నుంచి అమలు చేయనున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు వారు వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండటం, వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తుండటం, సిగ్నల్స్ జంప్ చేసి వెళుతుండటం.. వంటివాటిని పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి మార్గంలో, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి దుర్గం చెరువు మార్గంలో వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి దారి మళ్లించాలని నిర్ణయించారు.
ఇటీవల ఆపరేషన్ రోప్‌లో భాగంగా రాంగ్ పార్కింగ్ చేసినా, స్టాప్ లైన్ వద్ద వాహనాలను నిలపకపోయినా ఆయా వాహనదారులను గుర్తించి జరిమానాలు విధించిన పోలీసులు.. ఇప్పుడు మరిన్ని కొత్త రూల్స్‌ని అమలు చేయనున్నారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఈ వివరాలను వెల్లడించారు. కాబట్టి వాహనదారులూ పారాహుషార్!!