హైదరాబాద్ లో న్యూ ఇయర్ ట్రాఫిక్ ఆంక్షలు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ పై రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుఝాము 5గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారు ఝామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలున్న సమయంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వాహనాలను అనుమతించరు.
ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను రాజ్‌భవన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. లిబర్టీ సెంటర్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి దారి మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ రోడ్డు పూర్తిగా మూసివేస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ సర్కిల్, లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లిస్తారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ పై రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుఝాము 5గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే ఫ్లైఓవర్ పై కూడా ఇవే నిబంధనలు అమలులో ఉంటాయి. గచ్చిబౌలి శిల్పాలే అవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్ లెవెల్ 1, 2, షేక్‌పేట ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నం.45 ఫైఓ్లవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, బాలానగర్ బాబూ జగ్జీవన్ రాం ఫ్లైఓవర్ లపై కూడా నిబంధనలు అమలులో ఉన్న సమయంలో వాహనాలను అనుమతించరు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్ అధికారులు. డిసెంబర్ 31 రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కూడా చర్యలు తీసుకుంటారు. రాత్రి వేళ క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు ప్రజలకు సహకరించాలని, ప్రయాణాలకు నిరాకరించకూడదని పోలీసులు సూచించారు.