Telugu Global
Telangana

కొత్త సచివాలయం పరిసరాల్లో రేపు ఉదయం 4 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

కొత్త సచివాలయం పరిసరాల్లో రేపు ఉదయం 4 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
X

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ట్రాఫిక్ ఇలా మళ్లిస్తారు..

--> వీవీ విగ్రహం - నెక్లెస్ రోటరీ - ఎన్టీఆర్ మార్గ్ మధ్య వాహనాలను అనుమతించరు. తెలుగు తల్లి జంక్షన్‌ను మూసేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

--> ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజీ, నిరంకారి భవనం వైపు మళ్లిస్తారు.

--> నిరంకారి భవనం, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వరు. ఖైరతాబాద్ ఫ్లైవోవర్‌ను మూసేయనున్నట్లు పోలీసులు చెప్పారు.

--> ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, రాణీగంజ్ వైపు వెళ్లే వాహనదారులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ చేరుకోవాలి.

--> ట్యాంక్ బండ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చే నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.

--> బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.

--> బడా గణేష్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలు బడా గణేష్ లేన్ నుంచి రాజ్‌దూత్ హోటల్ లేన్‌కు మళ్లిస్తారు.

--> ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కు పూర్తిగా మూసేసి ఉంటాయి.

--> అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను.. రవీంద్ర భారతి, తెలుగుతల్లి ఫ్లైవోవర్, కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.

--> వీవీ విగ్రహం జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు ఇతర వాహనాలను అనుమతించరు.

భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ..

నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రేపటి కార్యక్రమానికి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ ఎక్కడ చేయాలి.. ఎటువైపు నుంచి వారికి అనుమతి ఇవ్వాలనే విషయాలను కూడా పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. కార్యక్రమం సజావుగా సాగేందుకు పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్‌కు సూచించారు. అనంతరం ఇతర పోలీసు అధికారులతో కలిసి సచివాలయం ఎదుట ఫొటో దిగారు.



First Published:  29 April 2023 6:50 AM IST
Next Story