Telugu Global
Telangana

తిట్టేవాళ్లు తిట్టనీ..! 'మర్రి' విషయంలో టీపీసీసీ సైలెన్స్

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గాలున్నాయి. ఒకరిని తిడితే, మరొకవర్గం వారు సంతోషించడం అక్కడ కామన్. పోనీ మర్రి శశిధర్ రెడ్డితో తిట్టించుకున్న ఉత్తమ్ వర్గం, రేవంత్ వర్గం విడివిడిగా కూడా స్పందించకపోవడం ఇక్కడ విశేషం.

తిట్టేవాళ్లు తిట్టనీ..! మర్రి విషయంలో టీపీసీసీ సైలెన్స్
X

పార్టీ మార్పు తర్వాత పాత పార్టీని చెడామడా తిట్టేస్తుంటారు చాలామంది, అతికొద్ది మంది మాత్రమే తమ పని తాము చూసుకుంటారు, పాత యజమానుల్ని పెద్దగా ఇబ్బంది పెట్టరు. కానీ మర్రి శశిధర్ రెడ్డి మాత్రం పార్టీ మారిన వెంటనే కాంగ్రెస్ ని చెడామడా తిట్టేశారు. రాహుల్ గాంధీతో మొదలు పెట్టి టీపీసీసీ మాజీ, తాజా అధినేతలిద్దరిపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంత ఘోరంగా తిట్టిన తర్వాత కనీసం టీపీసీసీ నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తారనుకుంటే అదీ లేదు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత గాంధీ భవన్ ఎలా బోసిపోయిందో, శశిధర్ రెడ్డి తిట్ల ఎపిసోడ్ తర్వాత కూడా టీపీసీసీ అదే సైలెన్స్ మెయింటెన్ చేస్తోంది.

రాహుల్ ని తిట్టినా పట్టించుకోరా..

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గాలున్నాయి. ఒకరిని తిడితే, మరొకవర్గం వారు సంతోషించడం అక్కడ కామన్. పోనీ మర్రి శశిధర్ రెడ్డితో తిట్టించుకున్న ఉత్తమ్ వర్గం, రేవంత్ వర్గం విడివిడిగా కూడా స్పందించకపోవడం ఇక్కడ విశేషం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా మర్రి వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. ఆమధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత వెంకట్ రెడ్డి అలకలు, అధిష్టానం బుజ్జగింపులు.. ఇలా సాగింది వ్యవహారం. అందుకే ఈసారి రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు. రాహుల్ గాంధీని తిట్టినా కూడా సైలెంట్ గా ఎందుకున్నారనేది ఇక్కడ తేలాల్సిన విషయం.

మర్రి పార్టీ మారకముందే ఆయనపై అధిష్టానం వేటు వేసింది. క్రమశిక్షణ చర్యలు తీసుకున్న తర్వాత, ఇక ఆయన గురించి స్పందించాల్సిన అవసరం లేదనుకున్నారు నేతలు. కానీ పార్టీ మారిన తర్వాత మర్రి రియాక్షన్ మామూలుగా లేదు. అధిష్టానంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ హయాంలో మర్రి చెన్నారెడ్డి కుటుంబానికి ఎంతో గౌరవం దక్కింది. ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా ఆయనకు పదవులిచ్చి గౌరవించింది కాంగ్రెస్. ఆ తర్వాత ఆయన తనయుడు మర్రి శశిధర్ రెడ్డి ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని తనదారి తాను చూసుకున్నారు. గతంలో తమ కుటుంబానికి అత్యథిక ప్రాధాన్యతనిచ్చిన కాంగ్రెస్ ని తీసిపారేస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి అనుకున్న స్థాయిలో రియాక్షన్స్ రాకపోవడమే ఇప్పుడు విశేషం.

First Published:  24 Nov 2022 1:08 PM IST
Next Story