వెంకట్ రెడ్డీ అయాం సారీ - రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డికి వెంకట్ రెడ్డికి సారీ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డికి వెంకట్ రెడ్డికి సారీ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆయనకు బేషరతుగా సారీ చెబుతున్న వీడియోని పోస్ట్ చేశారు.
"ఈమధ్య పత్రికా సమావేశంలో హోమ్ గార్డ్ ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి వాడిన పదజాలంపై ఆయన ఎంతో మనస్తాపానికి గురయ్యారు. వారు, పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ కండిషనల్ గా కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి గారికి సారీ చెబుతున్నా. ఇలాంటి చర్యలు, ఈ భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనకోసం శ్రమించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారిని అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యలకోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతోంది." అంటూ ట్విట్టర్ అకౌంట్ లో వీడియోని పోస్ట్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాణిక్కం టాగూర్, ఉత్తమ్ కుమార్ ని ట్యాగ్ చేశారు రేవంత్ రెడ్డి.
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అసలు గొడవ మొదలైంది. ఆయనను విమర్శించే క్రమంలో కోమటిరెడ్డి కుటుంబంపై కూడా పరుషపదజాలం వాడారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి హర్ట్ అయ్యారు. తన కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు సారీ చెప్పాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఏ సమావేశాలకు తనను పిలవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. తనను కాంగ్రెస్ వ్యక్తిగా గుర్తించడంలేదని, కనీసం ఎంపీ అన్న గౌరవం కూడా ఇవ్వడంలేదని చెప్పారు. తనను పార్టీలోనుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు వెంకట్ రెడ్డి.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి ప్రస్తుతానికి కాంగ్రెస్ మనిషే. అయితే అన్నదమ్ములిద్దర్నీ కలిపి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడంతో కలకలం రేగింది. ఈ వివాదం వల్ల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశముంది. అందుకే రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. వెంకట్ రెడ్డికి సారీ చెబుతూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.