కేఏ పాల్ వర్సెస్ ఆర్జీ పాల్.. రేవంత్ రెడ్డి ర్యాంగింగ్
తెలంగాణలో బీఎస్ కుమార్ ని ఈడీ హెడ్ గా అపాయింట్ చేశారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.బీఎస్ కుమార్ అనే కొత్త పేరు హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అదే కోవలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డికి ఆర్జీ పాల్ అనే పేరు పెట్టేశారు రేవంత్ రెడ్డి.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సీరియస్ గా మాట్లాడినా కామెడీగానే అనిపిస్తుంది. రాజకీయాల్లో కామెడీ చేసేవారిని కేఏ పాల్ తో పోల్చడం సర్వ సాధారణం. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా పాల్ తో పోలుస్తూ ర్యాంగింగ్ మొదలు పెట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజగోపాల్ ని ఇకపై ఆర్జీ పాల్ అని పిలవాలంటున్నారు. ఇదేదో సరదాగా చేసిన వ్యాఖ్యలు కావు, మునుగోడు ఉప ఎన్నిక కోసం జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆర్జీ పాల్ అంశాన్ని ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఇకపై అందరూ ఆయన్ను అలాగే పిలవాలని, అలా కాదని ఎవరైనా రాజ గోపాల్ రెడ్డి అని పిలిస్తే షోకాజ్ నోటీసులిస్తామని కూడా అన్నారట. షోకాజ్ నోటీసులు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. ఇప్పుడు ఆర్జీ పాల్ అనే పేరు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారబోతోంది.
బీఎస్ కుమార్..
ఆ మధ్య తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ని కేటీఆర్.. బీఎస్ కుమార్ అంటూ ట్విట్టర్లో ఆటాడేసుకున్నారు. తెలంగాణలో బీఎస్ కుమార్ ని ఈడీ హెడ్ గా అపాయింట్ చేశారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. ఈడీ ఎక్కడెక్కడ సోదాలు చేస్తుందో ముందుగానే సంజయ్ చెప్పేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో బీఎస్ కుమార్ అనే కొత్త పేరు హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అదే కోవలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డికి ఆర్జీ పాల్ అనే పేరు పెట్టేశారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత అధిష్టానాన్ని రాజగోపాల్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు. సోనియాని, రాహుల్ ని తాను విమర్శించబోనని చెప్పేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డిని మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఓ దశలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ పై ఫైర్ అయ్యారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం పదే పదే మీడియా సమావేశాల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రేవంత్ కూడా అంతే దీటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నిక్ నేమ్స్ పెట్టి మరీ ర్యాగింగ్ చేస్తున్నారు. ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో ఆర్జీ పాల్ అంటూ ఆయన్ని కామెంట్ చేస్తున్నారు. పాల్ తో పోలుస్తూ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డిని కూడా ఓ కమెడియన్ ని చేసేశారు రేవంత్ రెడ్డి.