Telugu Global
Telangana

కాళ్లు మొక్కడం.. దండం పెట్టడం.. ఇదేం వ్యూహమంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

ఒక్కో నాయకుడు నియోజకవర్గంలోని 100 మంది ఓటర్లకు కాళ్లు మొక్కి దండం పెట్టాలని రేవంత్ ఆదేశించారు. రేవంత్ చెప్పిన పనికి కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

కాళ్లు మొక్కడం.. దండం పెట్టడం.. ఇదేం వ్యూహమంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు
X

మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పార్టీలో విభేదాలు సృష్టించడమే కాకుండా.. ఉపఎన్నికకు కారకులయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా సీరియర్‌గా ఉన్నారు. ఒకవైపు అధికార టీఆర్ఎస్, మరో వైపు దూకుడు బీజేపీ కూడా దూకుడుగా ఉన్నది. ఇప్పుడు ఈ రెండింటినీ దాటి మునుగోడులో విజయాన్ని అందుకోవల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉన్నది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం మొదటి కర్తవ్యం అయితే.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలంటే, విజయం సాధించడం రేవంత్ రెడ్డికి అతి ముఖ్యం. అందుకే మునుగోడు ఉపఎన్నిక బాధ్యతను అంతా రేవంత్ రెడ్డి తన భుజానికి ఎత్తుకున్నారు. పేరుకు మండలాల వారీగా ఇంచార్జులను నియమించినా.. అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛతో రేవంత్ ఉత్సాహంగా పని చేస్తున్నారు.

ఎలాగైనా మునుగోడు సీటును తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి రచిస్తున్న వ్యూహాలు కాంగ్రెస్ కార్యకర్తలకు పిచ్చెక్కిస్తున్నాయి. తనతో సహా వెయ్యి మంది నాయకులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో నాయకుడు నియోజకవర్గంలోని 100 మంది ఓటర్లకు కాళ్లు మొక్కి దండం పెట్టాలని రేవంత్ ఆదేశించారు. రేవంత్ చెప్పిన పనికి కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. గెలవాలనే ఉత్సాహం ఓకే.. కానీ మరీ ఇలాంటి కార్యక్రమాలేమిటి బాబోయ్ అని తలలు పట్టుకుంటున్నారు. వెయ్యి మంది నాయకులు.. 100 మంది ఓటర్ల చొప్పున కాళ్లు మొక్కితే లక్ష మంది అవుతారు. మొక్కినోళ్లందరూ మనకు ఓటేస్తే గెలిచేసినట్లే అని కాంగ్రెస్ కార్యకర్తలే జోకులేసుకుంటున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఒక ప్రణాళిక ప్రకారం ముందు వెళ్లాలి. తమను గెలిపిస్తే నియోజకవర్గంలో ఎలా పని చేస్తామో? అధికార టీఆర్ఎస్‌ను ఎలా నిలదీస్తామో? 2023లో అధికారంలోకి వచ్చాక ఎలాంటి పథకాలు అమలు చేస్తామో చెప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాళ్లు మొక్కడం, పొర్లు దండాలు పెట్టడం అనే కాన్సెప్ట్‌తో ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీ పరువు పోవడం తప్ప మరొకటి ఉండదని కార్యకర్తలు అంటున్నారు. గెలవడానికి వ్యూహాలు లేకే ఇలాంటి పనులు చేస్తున్నారని మునుగోడుకు చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.

ఇక శనివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ జెండాలు ఎగురవేయనున్నారు. దేశానికి రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. అలాగే రేపటి నుంచి గ్రామగ్రామాన తిరిగి ఓటర్లను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొంత మంది సీనియర్ నాయకులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేయాలని.. అదే సమయంలో కాళ్లు మొక్కి, దండం పెట్టాలని సూచించారు. మొత్తానికి కాంగ్రెస్ పొర్లు దండాల కార్యక్రమం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

First Published:  20 Aug 2022 10:01 AM IST
Next Story