ఆ ప్రచారంతో ఉలిక్కిపడ్డ రేవంత్ టీం.. పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్‌లో సీనియర్ల ధాటికి తట్టుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి.. సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారన్నది ఆ ప్రచార సారాంశం. కొందరు మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేయించారని పోస్టులు పెట్టారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఒక విమర్శ ఉంది. ఆయన తన ప్రత్యర్థులపై ఎలాంటి ప్రచారమైనా సోషల్ మీడియాలో చేయిస్తారని. ఆయనపై ఎవరైన వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోరని. కొందరి రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ల భేటీ తర్వాత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక విషయం చెప్పారు. కాంగ్రెస్ తరపున సోషల్ మీడియాను నడుపుతున్న సునీల్ కనుగోలు తనపైనా తప్పుడు పోస్టులు పెట్టించారని వెల్లడించారు. మరి ఆ సునీల్ కనుగోలు ఎవరి కనుసన్నల్లో తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేశారో అందరికీ తెలుసు. సొంత పార్టీ నేతలపైనే ఎవరి లాభం కోసం సునీల్ వ్యతిరేక పోస్టులు పెట్టారో కూడా కాంగ్రెస్ సీనియర్లకు తెలుసు.
రేవంత్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అయింది. కాంగ్రెస్‌లో సీనియర్ల ధాటికి తట్టుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి.. సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారన్నది ఆ ప్రచార సారాంశం. కొందరు మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేయించారని పోస్టులు పెట్టారు.
దాంతో రేవంత్ రెడ్డిపై పార్టీలోనే అనుమానపు చూపులు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మనుషులు ఈ ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి మనుషులు కేసులుపెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.