వెంకటరెడ్డీ... నన్ను క్షమించు!
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. తాను చండూరు సభలో ఆయన గురించి అనుచితంగా మాట్లాడిన మాటలకు చింతిస్తున్నానని దయాకర్ అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు దయాకర్ క్షమాపణ చెప్పారు. నిన్న చండూరు సభలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతూ 'వెంకట రెడ్డీ.. ఉంటే ఉండు, పోతే పో ' అంటూ ఆవేశంగా చేసిన కామెంట్లపై టీపీసీసీ సీరియస్ అయింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో దయాకర్ ఇతర నేతలతో కలిసి శనివారం ప్రెస్ మీట్ పెట్టి.. జరిగిన దానికి తాను చింతిస్తున్నానని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తానా మాటలు అనలేదని, ఏమైనా.. వాటిని ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. వెంకటరెడ్డికి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అసలు ముందే టీపీసీసీకి అపాలజీ చెబుతూ లేఖ రాసినట్టు దయాకర్ తెలిపారు.
కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో కాక రేపుతున్న వేళ.. దయాకర్ కాస్త అతిగానే స్పందించడం పార్టీకి నష్టం కలిగించవచ్చునని టీపీసీసీ నేతలు భయపడ్డారు. పైగా ఓ వైపు మునుగోడులో తేలుతామా, మునుగుతామా అన్న సస్పెన్స్ అప్పుడే మొదలైంది కూడా.. మునుగోడు ఉపఎన్నిక వస్తే ఇలాంటి వ్యాఖ్యల కారణంగా నష్టమే తప్ప ప్రయోజనం ఉండదన్నది పార్టీ నేతల ఆందోళన.. అందుకే మొగ్గలోనే షో కాజ్ నోటీసులిచ్చి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలను భావించారు. ఇక ఈ వివాదం పెద్దదై తన పొలిటికల్ ఫ్యూచర్ ఎక్కడ చతికిలబడుతుందోనని కలవరం చెందిన దయాకర్ కామ్ అయిపోయి.. అపాలజీ చెప్పేశారు. ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏమిటంటే ఈయన కామెంట్స్ పై వెంకటరెడ్డి కనీసం స్పందించలేదు.