తెలంగాణ డీసీసీల మార్పునకు ప్రతిపాదన.. కాంగ్రెస్‌లో మొదలైన కొత్త లొల్లి
పాత వర్గం డీసీసీల్లో పాతుకొని పోవడంతో కొత్తగా వచ్చిన రేవంత్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తమ వర్గం వారిని డీసీసీల్లో కూర్చోబెట్టాలని రేవంత్ భావిస్తున్నారు. దాదాపు 12 డీసీసీల్లో మార్పు తప్పదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి మొదలైంది. రాష్ట్ర కమిటీని విస్తరించడంతో పాటు పలు డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను మార్చాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాహుల్ గాంధీకి వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో దాదాపు 230 మందిని సభ్యులుగా నియమించనున్నారు. అంతే కాకుండా 10 నుంచి 12 డీసీసీల్లో కూడా మార్పు ఉండనుంది. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ వద్దకు వెళ్లి కొత్త ప్రతిపాదనలను రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటికే రేవంత్ ప్రతిపాదనలకు అనుమతి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవ్వాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి డీసీసీ అధ్యక్షులతో పాటు టీపీసీసీ కమిటీ సభ్యులను.. కొత్తగా కమిటీలో చేర్చాలనుకున్న వారిని కూడా ఆహ్వానించారు. అయితే డీసీసీల్లో మార్పు ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. తమ పదవికి పొడిగింపు ఉండదని భావిస్తున్న కొంత మంది మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తుంది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తోంది. అంతకు మూడు, నాలుగు నెలల ముందే టీపీసీసీకి కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. కొత్త డీసీసీలను కూడా అప్పుడే ప్రకటించారు. అయితే ఏడాదిన్నర తిరగక ముందే కమిటీ, డీసీసీల్లో మార్పు చేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే జిల్లా అధ్యక్షులను మార్చాలని రేవంత్ రెడ్డి భావించారు. కానీ సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పటికి ఊరుకున్నారు. తాజాగా హైకమాండ్ అనుమతి ఇవ్వడంతో కొత్త వారి నియామకానికి మార్గం సుగమమం అయ్యింది. పలు జిల్లాలకు అధ్యక్షులుగా చాలా ఏళ్ల నుంచి ఒకరే ఉంటున్నారు. మధ్యలో కొన్ని మార్పులు జరిగినా తమ వర్గం వారినే అధ్యక్ష పీఠాలపై కూర్చోబెడుతున్నారు. పాత వర్గం డీసీసీల్లో పాతుకొని పోవడంతో కొత్తగా వచ్చిన రేవంత్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తమ వర్గం వారిని డీసీసీల్లో కూర్చోబెట్టాలని రేవంత్ భావిస్తున్నారు. దాదాపు 12 డీసీసీల్లో మార్పు తప్పదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఇక రాష్ట్ర కమిటీల్లో దాదాపు 230 మంది సభ్యులను తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల ప్రాతినిథ్యం ఉండేలా చూస్తున్నారు. ప్రతీ సెగ్మెంట్ నుంచి ఇద్దరు రాష్ట్ర కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి కమిటీలు లేక ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచింది. అప్పట్లో కమిటీల్లో సభ్యులుగా ఉన్న పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. కానీ వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయలేదు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో మునుగోడు ఉపఎన్నిక ఉండటంతో పార్టీకి పూర్తి స్థాయి కమిటీలను రేవంత్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
రేవంత్ ఇప్పటికే హైకమాండ్‌కు ఇచ్చిన లిస్టులో సగం మందికి పైగా ఆయన వర్గానికి చెందిన వాళ్లే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఇప్పటికే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. మంగళవారం కొంత మంది టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఎన్నికల వరకు అయినా తమకు ఛాన్స్ ఇవ్వాలని వారు కోరినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఏదీ తన చేతిలో లేదని.. మీరే వెళ్లి రేవంత్ దగ్గర చెప్పుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది. ఇవ్వాళ జరగనున్న సమావేశానికి డీసీసీ చీఫ్‌లతో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, శాశ్వత ఆహ్వానితులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలను ఆహ్వానించారు.
ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఆహ్వానం అందింది. మునుగోడు విషయంలో వీరిద్దరూ బహిరంగంగానే ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత రేవంత్ క్షమాపణ చెప్పినా.. అద్దంకి దయాకర్‌ను సస్పెండ్ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలుసుకున్నది లేదు. తాజాగా కీలక సమావేశం జరుగుతుండటంతో.. కోమటిరెడ్డి వస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతుంది. అలాగే పదవులు పోతాయనే భయంతో ఉన్న డీసీసీ అధ్యక్షులు కూడా సమావేశంలో రచ్చ చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను సిద్ధం చేసిన లిస్టును ప్రకటించాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు.