Telugu Global
Telangana

బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి.. రేవంత్ రెడ్డి కొత్త లాజిక్..

అభివృద్ధి కోసమే మునుగోడు ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేశానని చెప్పుకుంటున్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ టికెట్ పైనే తిరిగి పోటీ చేయొచ్చు కదా లాజిక్ తీశారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తానంటే బీ-ఫామ్ ఆయనకే ఇస్తామని సెటైర్లు వేశారు.

బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి.. రేవంత్ రెడ్డి కొత్త లాజిక్..
X

రాజీనామాలు చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే.. బీజేపీకి ఉన్న నలుగురు ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ నలుగురు రాజీనామా చేస్తే 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి కదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే మునుగోడు ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేశానని చెప్పుకుంటున్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ టికెట్ పైనే తిరిగి పోటీ చేయొచ్చు కదా లాజిక్ తీశారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తానంటే బీ-ఫామ్ ఆయనకే ఇస్తామని సెటైర్లు వేశారు.

ఆ డబ్బు గ్రామ పంచాయతీల ఖాతాలో వేయండి..

స్థానిక ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్న బీజేపీ ఆ నలుగురు ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అమ్ముడు పోయిన స్థానిక ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని గ్రామాల్లో ప్రజలు డిమాండ్‌ చేయాలన్నారు. అమ్ముడు పోయిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఆ డబ్బును గ్రామ పంచాయతీల ఖాతాల్లో వేసి అభివృద్ధి చేస్తారా? అని నిలదీశారు రేవంత్ రెడ్డి.

వెంకట్‌రెడ్డితో కలసి ప్రచారం చేస్తా..

ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నొచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి సారీతో కూడా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, రేవంత్ మాత్రం స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలసి తాను మునుగోడులో ప్రచారం చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన సొత్తుకాదని.. ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారని, అందరికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. సమష్టి నిర్ణయాలతోనే పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. డిండి పథకం పూర్తి చేయకుండా మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజీ లేదని, కొన్ని మండలాల్లో జూనియర్‌ కాలేజీకూడా లేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ కు ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.

First Published:  20 Aug 2022 8:30 AM IST
Next Story