Telugu Global
Telangana

పొన్నాలకు సిగ్గుండాలి.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్ కి నష్టమేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

పొన్నాలకు సిగ్గుండాలి.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కలకలం రేపింది. ఈ రాజీనామాపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ కు రాజీనామా చేయడాన్ని పొన్నాల లక్ష్మయ్య చేసిన అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. పార్టీ మారడానికి పొన్నాలకు సిగ్గుండాలన్నారు. "పీసీసీ ప్రెసిడెంట్‌ గా, మంత్రిగా పనిచేశావు. అయినా.. సచ్చే ముందల పార్టీ మారడం ఏంది..? ఇదేం రోగం. ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేస్తే ఎందుకు గెలవవు..?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్ కి నష్టమేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి.. పొన్నాల తక్షణమే తన రాజీనామా ఉపసంహరించుకోవాలన్నారు రేవంత్. కాంగ్రెస్ లో బీసీలకు ప్రాధాన్యం దక్కడం లేదన్న పొన్నాల ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

పట్టించుకోవాల్సిన పనిలేదు..

పొన్నాల రాజీనామాను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. అభ్యర్థుల జాబితా విడుదల కంటే ముందే పొన్నాల ఎలా రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీలోకి చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారని, పొన్నాల రాజీనామాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మొత్తమ్మీద పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం బాధపడటంలేదనే విషయం స్పష్టమైంది. పైగా పొన్నాలకు మంట పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడటం మరింత సంచలనంగా మారింది. ఈ దశలో ఇక పొన్నాల తన రాజీనామాను వెనక్కు తీసుకునే పరిస్థితి ఉంటుందని అనుకోలేం.

First Published:  13 Oct 2023 10:32 PM IST
Next Story