మునుగోడులో నేతల కొనుగోలు కమిటీలు.. కాంగ్రెస్ చార్జ్ షీట్..
హర్ ఘర్ తిరంగా లాగా.. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో హర్ ఘర్ కాంగ్రెస్ కార్యక్రమం మొదలు పెడతామన్నారు రేవంత్ రెడ్డి. ఇంటింటికీ కాంగ్రెస్ అనే నినాదంతో మునుగోడులో ప్రతి ఇంటికీ వెళ్తామన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక కోసం పార్టీలు ప్రచార కమిటీలు వేయడంలేదని, ప్రజా ప్రతినిధుల కొనుగోలు కమిటీలు వేశాయని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు పోటా పోటీగా కాంగ్రెస్ నేతల్ని కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ అమ్మకాలు, కొనుగోళ్లతో మునుగోడులో నాయకుల జేబులు నిండాయేకానీ, ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు.
సెప్టెంబర్ 1నుంచి ఇంటింటికీ కాంగ్రెస్..
హర్ ఘర్ తిరంగా లాగా.. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో హర్ ఘర్ కాంగ్రెస్ కార్యక్రమం మొదలు పెడతామన్నారు రేవంత్ రెడ్డి. ఇంటింటికీ కాంగ్రెస్ అనే నినాదంతో మునుగోడులో ప్రతి ఇంటికీ వెళ్తామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ఉధృతం చేస్తామని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కొందరు నేతలు పార్టీ మారుతూ కాంగ్రెస్ పై అనవసర విమర్శలు చేస్తున్నారు అన్నారు రేవంత్ రెడ్డి.
చార్జ్ షీట్ విడుదల చేస్తాం..
సెప్టెంబర్ 1న మునుగోడు ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అందులో నియోజకవర్గానికి జరిగిన అన్యాయాలను ప్రస్తావిస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం ద్వారా నల్లగొండ జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని నష్టం చేశాయని విమర్శించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాలు కాస్తా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు గా మారుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు కలెక్టరేట్ లు ప్రారంభించారని కానీ ఎంపీగా ఉన్న తనను ఆహ్వానించలేదన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. పైగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అని అన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 1నుంచి మునుగోడులో కాంగ్రెస్ ప్రచార పర్వం మొదలవుతుందని చెప్పారు.