పాదయాత్రకు రేవంత్ రెడీ.. అధిష్టానం అనుమతి ఉందా..?
కార్యవర్గం ఆమోదిస్తే రేవంత్ రెడ్డి భద్రాచలం నుంచి యాత్ర మొదలు పెడతారు. 126 రోజులపాటు ఆయన యాత్ర చేపట్టేందుకు ఆల్రడీ షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే తుది అనుమతి కోసం మాత్రమే ఆయన వేచి చూస్తున్నారు.
2024లో ఎన్నికలు ఉన్న ఏపీలో ప్రతిపక్షాలు పాదయాత్ర, వాహన యాత్రలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ ఏడేదే ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు ఆ స్థాయిలో సన్నద్ధం కాలేదు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ యాత్ర మొదలు పెట్టినా పెద్దగా స్పందన లేదు. సెమీ ఫైనల్స్ ని తలపించిన మునుగోడు ఉప పోరులో ప్రతిపక్షాలు పూర్తిగా చప్పబడటం కూడా దీనికి ఒక కారణం. ఇక కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే పాదయాత్రతో ఆయన ఒక్కరి మైలేజ్ పెరుగుతుందా, లేక పార్టీకి కూడా ఉపయోగం ఉండేలా యాత్రను డిజైన్ చేసుకున్నారా అనే విషయాల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ లో ఉద్ధండులు చాలామందే ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరిస్థితి. రేపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టినా.. ఎవరి ప్రాంతాల్లో వారు ఆయనతో కలసి నడుస్తారని చెప్పలేం. పోనీ రేవంత్ ని కాదని, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే ఉత్సాహం, సామర్థ్యం ఉన్నవారు లేరు. దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్రకు లైన్ క్లియర్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఆమోదముద్ర పడితే అది మరింత సమంజసంగా ఉంటుందని కొత్త ఇన్ చార్జ్ ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది. మాణిక్ రావ్ ఠాక్రే సూచనల మేరకు ఈరోజు కార్యవర్గ సమావేశంలో రేవంత్ పాదయాత్రకు ఆమోదముద్ర పడే అవకాశముంది. కార్యవర్గం ఆమోదిస్తే రేవంత్ రెడ్డి భద్రాచలం నుంచి యాత్ర మొదలు పెడతారు. 126 రోజులపాటు ఆయన యాత్ర చేపట్టేందుకు ఆల్రడీ షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే తుది అనుమతి కోసం మాత్రమే ఆయన వేచి చూస్తున్నారు.
హాథ్ సే హాథ్ జోడో..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత రాష్ట్రాల్లో హాథ్ సే హాథ్ జోడో పేరుతో స్థానిక నాయకత్వాలు కొనసాగింపు యాత్రలు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ యాత్రల్లో పీసీసీ నాయకులంతా పాల్గొంటారు. ఈ యాత్రలో భాగంగానే రేవంత్ రెడ్డి పాదయాత్రకూడా ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవేళ హాథ్ సే హాథ్ ని అందరు నాయకులతో కలసి విడిగా చేపట్టినా.. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. రేవంత్ పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు, ఆయనతో ఎవరెవరు కలసి నడుస్తారు అనే విషయాలపై కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశముంది.