Telugu Global
Telangana

నా పోటీ అక్కడి నుంచే.. రేవంత్‌ రెడ్డి క్లారిటీ..!

ఈనెల 26న చేవెళ్లలో ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తాండూరుకు సాగునీరు వస్తుందన్నారు.

నా పోటీ అక్కడి నుంచే.. రేవంత్‌ రెడ్డి క్లారిటీ..!
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో కొంతకాలంగా రేవంత్ పోటీపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది. గురువారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌ రెడ్డి.. స్థానిక సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డిని కలిశారు. తర్వాత నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై.. పోటీ అంశంపై చర్చించారు. టికెట్‌ కోసం తన తరఫున కొడంగల్ కాంగ్రెస్‌ లీడర్లు గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేస్తారని చెప్పారు.

ఈ సందర్భంగా అధికార బీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్న కేసీఆర్‌.. నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా పట్నం మహేందర్‌ రెడ్డికి అపాయిట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్.. ఓట్ల కోసం మంత్రిని చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీ ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ‌ తేదీన రూ. 4 వేల పింఛన్‌, ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈనెల 26న చేవెళ్లలో ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తాండూరుకు సాగునీరు వస్తుందన్నారు.

2006లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్‌ మండల్ జెడ్పీటీసీగా విజయం సాధించారు రేవంత్ రెడ్డి. తర్వాత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్రగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక 2009లో టీడీపీ టికెట్‌పై కొడంగల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫస్ట్ టైం శాసనసభలో అడుగుపెట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించారు. అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గానూ వ్యవహరించారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 అక్టోబర్‌ 31న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌పై కొడంగల్‌ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి..బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రేవంత్‌ రెడ్డి సామర్థ్యాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ అధిష్టానం 2021 జూన్‌లో పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

*

First Published:  24 Aug 2023 8:46 PM IST
Next Story