సొంత పార్టీవారికి మొండి చెయ్యి.. ఎదుటి పార్టీ నేతలకు స్నేహ హస్తం
టికెట్ దక్కనివారిని రేవంత్ కనీసం పలకరించడం లేదని, అసమ్మతిని చల్లార్చేందుకు వేసిన బుజ్జగింపుల కమిటీదే ఆ బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు.. తెలుగు టీవీ సీరియల్‌లా సాగుతూనే ఉంది. రెండు జాబితాల్లో టికెట్లు దక్కని అసంతృప్తులు అగ్గిమీద గుగ్గిలమవుతుంటే మరోవైపు కొత్త నేతలకు ఇంకా గాలం వేసే పనిలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉండటం గమనార్హం. టికెట్ దక్కనివారిని రేవంత్ కనీసం పలకరించడం లేదని, అసమ్మతిని చల్లార్చేందుకు వేసిన బుజ్జగింపుల కమిటీదే ఆ బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడుతున్నారు.
13 మంది కొత్తవారికి రెండో జాబితాలో టికెట్లు
కాంగ్రెస్ పార్టీ 55 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసినప్పుడు పెద్దగా నిరసనలేవీ బయటికి రాలేదు. ఎందుకంటే అప్పుడంతా సీనియర్లు, పార్టీలో కీలక నేతల అభ్యర్థిత్వాలే ఎక్కువ ఖరారవడంతో అసంతృప్తులు పెద్దగా లేవు. కానీ రెండో జాబితాలో 45 మందితో ప్రకటించగానే హస్తం పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన 13 మందికి టికెట్లివ్వడం ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన తమకు మొండిచెయ్యి చూపించారని టికెట్ ఆశించిన నేతలు మండిపడుతున్నారు. తమ అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వచ్చేవారికే ప్రాధాన్యమిస్తున్నారని, వివేక్ వెంటకస్వామిలా వదిలేసి వెళ్లిపోయన నేతల్ని తిరిగి తెచ్చుకోవడానికి తాపత్రయపడటమే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఆశావహులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
రేవంత్ అహంకారం చూపిస్తున్నారు!
కాంగ్రెస్ పార్టీలో తాము ఏళ్ల తరబడి పని చేశామని, కష్టకాలంలో పార్టీ జెండా మోశామని.. ఇప్పుడు తమను కాదని ప్యారాషూట్ నాయకులకు టికెట్లివ్వడమేంటని టికెట్ ఆశించి భంగపడిన నేతలు భగ్గుమంటున్నారు. టికెట్ ఇవ్వకపోయినా కనీసం అందుకు దారితీసిన పరిస్థితుల గురించి చెప్పి సముదాయించాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని, ఇది అహంకారం చూపించడమేనని ఆశావహులు మండిపడుతున్నారు. సొంత పార్టీలో ఉన్నవారికి మొండి చేయి చూపించి.. ఎదుటి పార్టీలో నేతలకు స్నేహహస్తం చాస్తున్నారని మండిపడుతున్నారు.
♦