తుమ్మల ఇంటికి రేవంత్.. కాంగ్రెస్‌లో చేరిక కన్ఫామ్..!
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తుమ్మల పాలేరు నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ దక్కక పోవటంతో బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన తుమ్మల.. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 6న ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తుమ్మల పాలేరు నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ దక్కక పోవటంతో బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే అనుచరులతో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సోషల్‌మీడియా ఖాతాల్లోనూ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను తొలగించారు. ఇక తుమ్మల పార్టీలోకి వస్తే పాలేరు లేదా ఖమ్మం టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
2018లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఏ పదవి లేకుండానే ఖాళీగా ఉన్నారు తుమ్మల. అయితే గులాబీ బాస్ కేసీఆర్.. సిట్టింగ్‌లకే టికెట్లు కన్ఫామ్ చేయడంతో తుమ్మల తీవ్ర నిరాశకు గురయ్యారు.
*