అక్కడ ఈ పథకాలు ఎందుకు లేవంటే..? రేవంత్ రెడ్డి వివరణ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. అంతకంటే మెరుగైన విధానాన్ని తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు, ఆ పార్టీ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేవు..? పోనీ దేశం మొత్తం ఈ కొత్త పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎందుకు ప్రకటించడంలేదు..? బీఅర్ఎస్ సూటి ప్రశ్న ఇది. ప్రజలకు కూడా ఇది లాజికల్ గానే తోచింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే దేశం మొత్తం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, దేశం మొత్తం మహిళలకు ఉచిత ప్రజా రవాణా కల్పిస్తామని ఆ పార్టీ ఎందుకు చెప్పడంలేదనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందని, ఎలాగూ గెలవలేమనే నిర్ణయానికి వచ్చి, ఇలాంటి పథకాలను ప్రకటించిందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఈ విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానిచ్చారు.
ఆయా రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితుల ఆధారంగా ఒక్కో విధానం ఉంటుందని, అందుకే తాము అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పడం లేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా 99 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని జోస్యం చెప్పారు. తాము తెలంగాణలో అధికారం చేపట్టిన వెంటనే 100రోజుల్లోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. హామీల అమలులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలను ప్రజలు పోల్చి చూడాలని కోరారు.
తెలంగాణలో సీడబ్ల్యూసీ మీటింగ్, విజయభేరి సభ, అభయహస్తం గ్యారెంటీల ప్రకటన విజయవంతమైందని అన్నారు రేవంత్ రెడ్డి. సోనియా, రాహుల్, ప్రియాంక.. ఇతర నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బహురూపు వేషాలతో తమ సమావేశాలను అడ్డుకోవాలని చూశారని, కానీ అవి అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. అంతకంటే మెరుగైన విధానాన్ని తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి.