Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి పాదయాత్రపై భిన్నాభిప్రాయాలు.. అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం

రేవంత్ రెడ్డి పాదయాత్ర సోమవారం నుంచి మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని మేడారం నుంచి ప్రారంభం కానుంది.

రేవంత్ రెడ్డి పాదయాత్రపై భిన్నాభిప్రాయాలు.. అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపి, ప్రజలకు దగ్గరై, రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' విజయవంతం కావడంతో.. దానికి కొనసాగింపుగా ప్రతీ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు 'హాత్ సే హాత్ జోడో' పేరుతో యాత్రలు నిర్వహించేందుకు హై కమాండ్ అనుమతులు ఇస్తుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రేవంత్ రెడ్డి పాదయాత్ర సోమవారం నుంచి మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని మేడారం నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో ఆ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రపై అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. శనివారం గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, యాత్ర మానిటరింగ్ కమిటీ కన్వీనర్ ఏ. మహేశ్వర్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతల పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాదయాత్రపై వాడి వేడి చర్చ జరిగింది. రేవంత్ పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని కొందరు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ ఠాక్రేను కోరినట్లు సమాచారం. అధిష్టానం 'హాత్ సే హాత్ జోడో' పేరుతో కాంగ్రెస్ స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే వారికే పాదయాత్రలకు అనుమతులు ఇస్తోందని, మహారాష్ట్రలో ఇలాగే ఇద్దరు ముగ్గురు నేతలు పాదయాత్రలు చేశారని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం పేరును 'యాత్ర' అని పెట్టుకున్నారని.. దాన్ని వన్ మ్యాన్ షోగా మార్చి వేస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన ఇమేజ్‌ను పెంచుకోవడానికే ఈ యాత్ర చేస్తున్నారు. అంతే కానీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడానికి కాదని ఓ వర్గం నేతలు వాదించినట్లు సమాచారం.

గతంలో కూడా రేవంత్ రెడ్డి పలు మార్లు పాదయాత్రలు, రోడ్ షోలు చేశారని.. ఏనాడూ అవి ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీకి అవి ప్లస్ కాలేదని గుర్తు చేస్తున్నారు. ఇతర నేతలు ఇలా మాట్లాడే సమయంలో రేవంత్ రెడ్డి కానీ, ఆయన వర్గం కానీ పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. కానీ, చివరకు మాణిక్ ఠాక్రే యాత్రకు అధిష్టానం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని.. ఇప్పుడు తాను చేసేది ఏమీ ఉండదని చెప్పినట్లు సమాచారం.

కాగా, సోమవారం మేడారం నుంచి జరుగుతున్న పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే సీతక్క చేస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఆమె రేవంత్ రెడ్డి వర్గం నేతగా ముద్ర వేసుకున్నారు. ఆమె కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ములుగు నుంచి గెలిచారు. ఇప్పుడు ఈ యాత్రకు కూడా ఆమే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి ఇతర పాదయాత్రల్లాగా కాకుండా.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసినట్లుగా విడతలుగా పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున ముందుగా కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఆయన పాదయాత్రను చేసి.. బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే గాంధీభవన్‌లో ఒక కో-ఆర్డినేషన్, మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు.

First Published:  5 Feb 2023 9:52 AM IST
Next Story