Telugu Global
Telangana

'యాత్ర' పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. జనవరి 26న ప్రారంభం

తొలుత 'సకల జనుల సంఘర్షణ యాత్ర' అని పేరు పెడతారనే వార్తలు వచ్చాయి. కానీ, చాలా సింపుల్‌గా 'యాత్ర' అనే పేరుతో సరిపెట్టారు.

యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. జనవరి 26న ప్రారంభం
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఎక్స్‌టెండెడ్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు 'యాత్ర' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన లోగో, పోస్టర్ కూడా విడుదల చేశారు. తొలుత 'సకల జనుల సంఘర్షణ యాత్ర' అని పేరు పెడతారనే వార్తలు వచ్చాయి. కానీ, చాలా సింపుల్‌గా 'యాత్ర' అనే పేరుతో సరిపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్.. కాంగ్రెస్ పార్టీ ఓటములతో అల్లాడుతున్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఆ నేపథ్యంలో తీసిన వైఎస్ఆర్ బయోపిక్‌‌కి 'యాత్ర' అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు అదే పేరును రేవంత్ రెడ్డి వాడుకుంటుండటం గమనార్హం. వైఎస్ఆర్ అభిమానులకు కూడా కనెక్ట్ అవుతుందనే ఆ పేరు పెట్టినట్లు తెలుస్తున్నది.

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి 'యాత్ర' ప్రారంభం కానున్నది. ఇవ్వాళ జరిగిన కీలక పరిణామాల మధ్యే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల గుండా ఈ యాత్ర కొనసాగనున్నది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు యాత్రను ముగించేలా ప్లాన్ చేశారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ కల్లా యాత్రను ముగించి.. ఆ తర్వాత ఎన్నికల పనుల్లో బిజీగా ఉండనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని రావడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని రెండు పార్టీల నాయకులు పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు విడతల్లో 'ప్రజా సంగ్రామ యాత్ర' నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 విడతల పాదయాత్ర పూర్తి చేశారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ఆమె తిరిగి పాదయాత్ర కొనసాగించనున్నారు.

ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేయడానికి నాయకులకు ఏఐసీసీ అనుమతులు ఇస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రకు దరఖాస్తు చేయగా.. అధిష్టానం పచ్చజెండా ఊపింది. ఈ యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించగా.. సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. సమావేశం అనంతరం 13 మంది నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. యాత్రను సక్సెస్ చేస్తామని రేవంత్ వర్గం నేతలు అంటున్నారు.

First Published:  18 Dec 2022 7:57 PM IST
Next Story