ఎల్లారెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం టఫ్ ఫైట్.. రేవంత్ వర్సెస్ రాహుల్‌గా విడిపోయిన నాయకులు
జహీరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టారు.
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజవర్గం కాంగ్రెస్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్‌లో గ్రూపులు ఉండటం సహజమే. అవి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల గ్రూపులుగా ఉంటాయి. కానీ ఎల్లారెడ్డిలో ఏకంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వర్గాలుగా నాయకులు విడిపోవడం గమనార్హం. రాబోయే అసెంబ్లీ టికెట్ కోసం ఈ రెండు గ్రూపులకు చెందిన ఇద్దరు కీలక నాయకులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2018లో ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా మూడు సార్లు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు.
జాజల సురేందర్ కాంగ్రెస్‌ను వీడిపోవడంతో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టారు. అప్పటికే అక్కడ ఉన్న సీనియర్ నాయకుడు సుభాష్ రెడ్డిని కలుపుకొని పోతూ పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. అయితే నిన్న మొన్నటి వరకు పోటీలో లేని సుభాష్ రెడ్డి ఇప్పుడు అకస్మాతుగా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని సుభాష్ రెడ్డి తన అనుచరులకు చెబుతున్నారు. తనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ ఉందని.. టికెట్ తనకే దక్కుతుందని చెప్పుకుంటున్నారు.
ఇక మదన్ మోహన్ రావు మాత్రం తనకు ఏఐసీసీ స్థాయిలో అండదండలు ఉన్నాయని.. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయని సెగ్మెంట్‌లో ప్రచారం చేసుకుంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తనకు మద్దతు ఇస్తున్నారని.. తప్పకుండా తనకే టికెట్ వస్తుందని మదన్ మోహన్ రావు చెబుతున్నారు. రాహుల్ టీమ్‌తో ఇప్పటికే మాట్లాడానని.. వాళ్లు సానుకూలంగా స్పందించారని కూడా స్థానిక నాయకులకు మదన్ చెప్పినట్లు తెలుస్తున్నది.
కాగా, ఇటీవల సునిల్ కనుగోలు టీమ్ చేసిన సర్వేలో ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. ఎల్లారెడ్డి పరిధిలోని పలువురు సర్పంచ్, ఎంపీటీసీలను మదన్ కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చారు. అధికార బీఆర్ఎస్‌పై మదన్ దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పడ్డారు. అందుకే తనకు టికెట్ కన్ఫార్మ్ అని ధీమాగా ఉన్నారు.
అయితే సుభాష్ రెడ్డి మాత్రం తన సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. సర్వేలు, రాహుల్ గాంధీ అనే మాటలు ఉత్తవేనని.. మదన్ కావాలనే ప్రచారం చేసుకుంటున్నాడని సుభాష్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వీరిద్దరి మధ్య ఉప్ప నిప్పులా పరిస్థితి మారిపోయింది. దీంతో కార్యకర్తలు ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక పోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా ఎల్లారెడ్డి విషయంలో ఏమీ తేల్చలేక.. ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ప్రస్తుతం బంతి స్క్రీనింగ్ కమిటీ కోర్టులో ఉన్నది. సీడబ్ల్యూసీ సమావేశాలు, పార్లమెంట్ ప్రత్యేక సెషన్ అనంతరం ఎల్లారెడ్డి టికెట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.