Telugu Global
Telangana

కీలక పదవులపై కన్నేసిన ఆ ఇద్దరు.. డీకేతో లాబీయింగ్‌..!

ఇద్దరు అధికారులు ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ సన్నిహితులను కలిశారని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.

కీలక పదవులపై కన్నేసిన ఆ ఇద్దరు.. డీకేతో లాబీయింగ్‌..!
X

తెలంగాణలో ప్రభుత్వం మారడంతో.. గత బీఆర్ఎస్ పాలనలో కీలకంగా వ్యవహరించిన పలువురు సీనియర్ బ్యూరోక్రాట్లు.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలక పదవుల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒక సీనియర్ IAS అధికారి, మరొకరు సీనియర్ IPS అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు అధికారులు ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ సన్నిహితులను కలిశారని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. చీఫ్ సెక్రటరీతో పాటు డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ పోలీస్ (డీజీపీ) పదవులపై ఈ ఇద్దరు అధికారులు కన్నేశారని సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తమ తరఫున మాట్లాడాలని ఈ ఇద్దరు అధికారులు డీకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్నవారి ప‌ద‌వీ విరమణ తర్వాత ఆలోచిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయా హోదాల్లో పనిచేస్తున్న వారినే కొనసాగించేందుకు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని సమాచారం.

ప్రస్తుతం 1989 IAS బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సీనియారిటీ ప్రకారం.. 1989 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్ గోయల్‌ సీఎస్‌ పదవి రేసులో ఉన్నారు. ఆయన తర్వాత 1990 బ్యాచ్‌కు చెందిన సునీల్ శర్మ, 1991 బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు, అరవింద కుమార్‌ ఉన్నారు. ఈ అధికారులంతా ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు అధికారులు సీఎస్‌ పోస్టు కోసం పోటీ పడుతున్నారని సమాచారం.

ఇక ప్రస్తుతమున్న‌ డీజీపీ రవి గుప్తా 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. అంజనీ కుమార్ సైతం ఇదే బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇక వీరి తర్వాత రేసులో రాజీవ్ రతన్‌, సీవీ ఆనంద్ ఉన్నారు. ఈ ఇద్దరు 1991 బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుతం వీరిద్దరూ డైరెక్టర్ జనరల్ ర్యాంకులో ఉన్నారు. రవిగుప్తా తర్వాత డీజీపీగా ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  15 Dec 2023 6:59 AM GMT
Next Story