Telugu Global
Telangana

రేపటితో మైకులు బంద్.. మునుగోడులో పక్కాగా పోలీసింగ్

నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఎలక్షన్ కమిషన్ సీఈవో వికాస్‌ రాజ్‌.

రేపటితో మైకులు బంద్.. మునుగోడులో పక్కాగా పోలీసింగ్
X

మునుగోడు ప్రచారానికి రేపటితో తెరపడబోతోంది. నవంబర్ 3న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాల్లో 105 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. అక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఎలక్షన్ కమిషన్ సీఈవో వికాస్‌ రాజ్‌.

బయట వ్యక్తులకు నో ఎంట్రీ..

ప్రచారం ముగిసిన వెంటనే మునుగోడు స్థానికేతరులు వెంటనే నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించారు అధికారులు. ఇక ఫిర్యాదుల కోసం సీ విజల్‌ యాప్‌ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రచారం పూర్తయిన తర్వాత బల్క్ ఎస్ఎంఎస్ లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనికి అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చారు.

ఓటర్లు, సిబ్బంది లెక్కలు ఇవి..

మునుగోడు నియోజకవర్గ పరిధిలో 2.41లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు 5,686 మంది. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్బన్‌ లో 35, రూరల్‌ పరిధిలో 263 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం పోలింగ్ సిబ్బంది 1,192 మంది. 300 మందిని అదనంగా పిలిపించారు. 199 మంది మైక్రో అబ్జర్వర్లు, 298మంది బూత్ లెవల్ ఆఫీసర్లు ఉంటారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. నవంబర్-3 ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. ప్రచారం పూర్తయిన వెంటనే నియోజకవర్గం మొత్తాన్ని జల్లెడపట్టడానికి పోలీసులు సిద్ధమయ్యారు. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు చేపడతారు.

First Published:  31 Oct 2022 3:26 PM GMT
Next Story