Telugu Global
Telangana

టమాటా వ్యాపారుల్ని నిండా ముంచిన భారీ వర్షాలు

నిల్వచేసిన సరకు పాడైపోతోంది, మరోవైపు వర్షాలకు కనీసం మార్కెట్ కి వచ్చేవారు కూడా కరువయ్యారు. వచ్చినా టమాటాల జోలికి చాలామంది వెళ్లడంలేదు.

టమాటా వ్యాపారుల్ని నిండా ముంచిన భారీ వర్షాలు
X

ఇటీవల టమాటా రైతులు, వ్యాపారులు భారీగా లాభాలు కళ్లజూశారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చిపడిన భారీ వర్షాలు టమాటా రైతుల్ని నిండా ముంచాయి. రోజురోజుకీ రేటు పెరుగుతుండటంతో ఒక్కసారిగా టమాటాలు కొని నిల్వచేసిన వ్యాపారులు, మూడు రోజులుగా బేరాలు లేక ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు టమాటాలు కుళ్లిపోవడంతో చివరకు కుప్పతొట్టెల్లో పారబోయాల్సిన పరిస్థితి.

అంతకంతకూ పెరుగుతున్న టమాటా రేట్లు.. వ్యాపారులకు కూడా లాభాలనిచ్చాయి. రోజు రోజుకీ రేటు పెరుగుతుండటంతో.. తక్కు రేటుకి కొన్న సరుకుని, ఎక్కువ లాభానికి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ లోని వ్యాపారులు కూడా రేటు భారీగా పెరుగుతుందనే అంచనాతో పెద్దమొత్తంలో సరకు కొని నిల్వచేశారు. అయితే మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వారు నిండా మునిగారు. నిల్వచేసిన సరకు పాడైపోతోంది, మరోవైపు వర్షాలకు కనీసం మార్కెట్ కి వచ్చేవారు కూడా కరువయ్యారు. వచ్చినా టమాటాల జోలికి చాలామంది వెళ్లడంలేదు. దీంతో తెచ్చిన సరుకంతా పాడైపోవడంతో చెత్తకుప్పలో పారబోశారు.

వరంగల్‌లోని టమాటా వ్యాపారులు.. మదనపల్లి, కర్నాటక మార్కెట్ల నుంచి ఇటీవల పెద్ద ఎత్తున టమాటలను తెప్పించి నిల్వచేశారు. సరిగ్గా సరుకు వచ్చిన తర్వాత వర్షాలు మొదలయ్యాయి. భారీ పెట్టుబడితో తీసుకొచ్చిన టమాటాలు వర్షం కారణంగా ఒక్కరోజులోనే పాడైపోయాయని లబోదిబోమంటున్నారు వ్యాపారులు. డిమాండ్ ఉన్నా కూడా వర్షాలకు జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. మార్కెట్ కి వచ్చేవారు తక్కువయ్యారు. దీంతో టమాటాలు పశువులకు ఆహారంగా మారాయి.

First Published:  21 July 2023 1:56 PM IST
Next Story