Telugu Global
Telangana

ఫొటో దిగితే పావుకేజీ టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే..?

తన స్టూడియోలో 8 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు దిగినవారికి పావుకేజీ టమాటాలు ఫ్రీ అని ప్రచారం చేశాడు, ఫ్లెక్సీలు వేశాడు. కొంతమందికి టమాటాలు ఇస్తున్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

ఫొటో దిగితే పావుకేజీ టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే..?
X

ఫొటో దిగితే పావుకేజీ టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే..?

టమాటాలు కూరకోసమే కాదు, ఇప్పుడు ఉచిత ప్రచార వస్తువుల్లా మారిపోయాయి. టమాటాలకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా ఆసక్తిగా మారుతున్న నేపథ్యంలో చాలామంది టమాటాలతో ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తున్నారు. ఆమధ్య టమాటాలకు బాడీగార్డ్స్ ని పెట్టి ఓ వ్యాపారి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు. కూతురికి ఆలయంలో టమాటాలతో తులాభారం వేసిన ఓ తండ్రి, కూతురి పుట్టినరోజున పేదలకు టమాటాలు పంచిపెట్టి మరో తండ్రి వార్తల్లో వ్యక్తులయ్యారు. ఇప్పుడు తెలంగాణ నుంచే ఓ ఫొటో స్టూడియో ఓనర్ టమాటాలతో పబ్లిసిటీ మొదలు పెట్టాడు. టమాటా ఆఫర్లు ప్రకటించాడు.

ఆఫర్ ఏంటంటే..?

కొత్తగూడెంకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆనంద్ కి బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్ లో స్టూడియో ఉంది. సెల్ ఫోన్లు వచ్చాక స్టూడియోలో దిగే ఫొటోలకు డిమాండ్ తగ్గినమాట వాస్తవం. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలకి కూడా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఆనంద్ కి ఓ ఐడియా వచ్చింది. తన స్టూడియోలో 8 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు దిగినవారికి పావుకేజీ టమాటాలు ఫ్రీ అని ప్రచారం చేశాడు, ఫ్లెక్సీలు వేశాడు. కొంతమందికి టమాటాలు ఇస్తున్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇంకేముంది జనాలు ఆ షాపు ముందు క్యూ కట్టారు. కొంతమందికి అవసరం లేకపోయినా ఫొటోలు దిగి డబ్బులిచ్చి, ఫ్రీ టమాటాలు తీసుకెళ్తున్నారు.

ఇటీవల కలెక్టరేట్ తో పాటు, కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ పాల్వంచ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ లోకి మారిపోవడంతో బస్టాండ్ సెంటర్లో ఉన్న స్టూడియో ఆనంద్ కి వ్యాపారం తగ్గింది. గతంలో కలెక్టరేట్ కి వచ్చేవారంతా బస్టాండ్ లో ని ఫొటో స్టూడియోలకు వచ్చేవారు, ఇప్పుడు వారంతా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. దీంతో ఈ టమాటా ఉపాయం ఆలోచించాడు ఆనంద్. మామూలు రోజుల్లో 8 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలకి 100 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు వీటితోపాటు పావుకేజీ టమాటా(రూ.50) ఫ్రీగా ఇస్తున్నాడు. 50 రూపాయలు నష్టం వచ్చినా బిజినెస్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాడు ఆనంద్. టమాటా ధరలు తగ్గే వరకు ఈ ఆఫర్ కొనసాగిస్తానంటున్నాడు. ఐడియా బాగానే ఉంది, ఈ ఆలోచనతో ఆ స్టూడియో వార్తల్లోకెక్కింది.

First Published:  3 Aug 2023 6:41 AM IST
Next Story