Telugu Global
Telangana

లక్షా 16వేల కార్లు.. హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాయి

సంక్రాంతి సందర్భంగా గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 1.24లక్షల వాహనాలు వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

లక్షా 16వేల కార్లు.. హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాయి
X

ఉపాధికోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన వారంతా సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ బోసిపోయింది. టోల్ గేట్ లెక్కల ప్రకారం లక్షా 16వేల కార్లు హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లిపోయాయి. రెండురోజుల వ్యవధిలో ఈ స్థాయిలో వాహనాలు తరలి వెళ్లడం ఒక రికార్డ్. అది కూడా ఈఏడాది అత్యధికం. కరోనా తర్వాత వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. కొత్తదా, పాతదా అనే విషయం పక్కనపెట్టి.. మధ్యతరగతి కుటుంబాలు కూడా సొంతకారు ఉండాలని నిర్ణయించుకున్నాయి. అందుకే కరోనా తర్వాత వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ సందర్భంగా ఆ విషయం మరోసారి పక్కాగా రుజువైంది.

సంక్రాంతి సందర్భంగా గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 1.24లక్షల వాహనాలు వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జనవరి 12న 56,500వాహనాలు పంతంగి టోల్ ప్లాజా నుంచి వెళ్లగా.. 13వ తేదీన 67,500 వాహనాలు వెళ్లినట్లు వివరించారు. పండగ కోసం వెళ్తున్న వారిలో 90శాతం మంది వ్యక్తిగత వాహనాల ద్వారానే వెళ్లినట్లు తెలిపారు పోలీసులు. రెండు రోజుల్లో మొత్తం 98వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు పోలీసుల లెక్కల్లో తేలింది. అటు హైదరాబాద్ నుంచి వరంగల్‌ కు బీబీనగర్ టోల్ గేట్ మీదుగా 26వేల వాహనాలు వెళ్లగా అందులో 18వేల కార్లు ఉన్నాయి. అంటే ఈ రెండు రోజుల్లో టోల్ గేట్లు దాటిన మొత్తం కార్ల సంఖ్య 1.16 లక్షలు.

జంక్షన్ల వద్ద పోలీసుల తిప్పలు..

రెండురోజుల్లో భారీ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఎల్బీనగర్, ఉప్పల్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పోలీసులు. అటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బృందాల సాయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకుంది. టోల్ గేట్ల వద్ద వాహనాలను క్రమ పద్ధతిలో పంపించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, పండగ సెలవల తర్వాత తిరిగి వచ్చే సమయంలో కూడా ప్రజా రవాణాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచించారు. గూడ్స్ వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించొద్దని హెచ్చరించారు. ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.

First Published:  14 Jan 2023 4:48 PM IST
Next Story