Telugu Global
Telangana

నిర్మాణం పూర్తికాని హైవేపై టోల్ వసూలు: టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి

నిర్మాణం పూర్తికాని హైవేపై టోల్ వసూలు: టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి
X

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద ప్రజల ముక్కు పిండి టోల్ వసూలు చేస్తున్నది. టోల్ ఫీజు చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఒకవైపు ఉండగానే రోడ్డు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తూ మరో దోపిడికి తెరతీశారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్యే ఒకరు టోల్ ప్లాజా సిబ్బంది పై దాడికి దిగిన సంఘటన కలకలం రేపింది.

మందమర్రి వద్ద 363 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇటు ఎమ్మెల్యేపై అటు NHAIపై విమర్శలు వస్తున్నాయి. పనులు 100 శాతం పూర్తికాకముందే టోల్‌ప్లాజాలో రుసుము వసూలు చేయకుండా నిరోధించడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ వీడియో క్లిప్‌లో, చిన్నయ్య సిబ్బందిని చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తి కానప్పటికీ టోల్ చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేసిన‍ందుకు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే శాసన సభ్యునిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మందమర్రి ఇన్‌స్పెక్టర్ ఎస్ ప్రమోద్ రావు తెలిపారు.

టోల్ వసూలుకు అనుమతి ఇచ్చేది NHAI. వసూలు చేసి డబ్బులు జేబులో వేసుకునేది కాంట్రాక్టర్లు. మధ్యలో చిన్న జీతాలకు పనిచేసే ఉద్యోగులపై దాడులకు దిగితే ఉపయోగమేంటని ఎమ్మెల్యేపై విమర్శలు వస్తున్నాయి.

కాగా వాహనదారుల నుండి టోల్ రుసుము వసూలును నిరసిస్తూ నిర్మాణంలో ఉన్న 363 జాతీయ రహదారి పై మందమర్రిలోని ప్లాజా వద్ద డిసెంబర్ 30న, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) సభ్యులు ధర్నా నిర్వహించారు. డిసెంబర్ 30 నుండి టోల్ ఫీజువసూలు ప్రారంభమయ్యింది.


కాగా మందమర్రి 363 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి టోల్ ప్లాజా సిబ్బందిపై తాను దాడి చేశాన‌న్న ఆరోపణలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు.

ప్లాజా సిబ్బందిపై తాను దాడి చేయలేదని చిన్నయ్య ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మంచిర్యాల-చంద్రాపూర్ జాతీయ రహదారి పనులు పూర్తి కాకముందే ఫీజులు వసూలు చేయడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్లాజాకు 200 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. అంబులెన్స్ లను కూడా డబ్బులు కట్టకుండా అనుమతించడం లేదని, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయకుండానే వాహనదారులపై పన్ను విధించినందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)ని తప్పుబట్టారు. ఈ విషయం అడుగుదామని తాను మేనేజర్ దగ్గరికి వెళ్ళాను తప్ప ఎవరిపైనా దాడి చేయలేదని ఆయన చెప్పారు.

First Published:  4 Jan 2023 12:23 PM IST
Next Story